సాక్షి, అమరావతి: పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అక్రమాల నిగ్గు తేల్చేందుకు సిద్ధమైన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనులపై విచారణకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా అక్రమాలకు సూత్రధారులు, పాత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాంట్రాక్టర్లు దోచుకున్న ప్రజాధనాన్ని రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి తిరిగి వసూలు చేయనుంది. టీడీపీ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. తొలుత పోలవరం పనులపై విచారణ చేసిన నిపుణుల కమిటీ రూ.3,128.31 కోట్ల మేర అక్రమాలు జరిగాయని తేల్చింది. లోతుగా విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి తెలిపింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం డీజీ (డైరెక్టర్ జనరల్) రాజేంద్రనాథ్‌రెడ్డి పోలవరం పనులపై విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువల పనుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై ఈ మూడు బృందాలు వేర్వేరుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నాయి. పనులను పర్యవేక్షించిన అధికారులు రాతపూర్వకంగా ఇచ్చే వివరణలో సూత్రధారుల పేర్లను వెల్లడిస్తే ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోనుంది. విజిలెన్స్ విభాగం శరవేగంగా కదులుతుండటంతో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, ఇందులో ప్రమేయం ఉన్న అధికారులు, కాంట్రాక్టర్లలో కలకలం రేగుతోంది.
ఎస్‌ఈలకు విజిలెన్స్ లేఖలు...
- పోలవరం హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువల అంచనా వ్యయం 2010–11, 2004–05 ధరల ప్రకారం ఎంత? ఏ ప్యాకేజీల పనులను ఏ కాంట్రాక్టర్లకు ఎంత ధరకు అప్పగించారు. 2015–16 ధరలను వర్తింపజేసిన తర్వాత అంచనా వ్యయం ఎంత పెరిగింది? వాటికి సంబంధించిన ఎస్టిమేట్ కాపీలను తక్షణమే అప్పగించాలంటూ పోలవరం సీఈ సుధాకర్‌బాబుతోపాటు హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువల పనులను పర్యవేక్షించే ఎస్‌ఈలకు విజిలెన్స్ విభాగం లేఖలు రాసింది.
- టెండర్ల ద్వారా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎంత పరిమాణం పనులు చేశారు? ఎంత బిల్లులు చెల్లించారు? 60 సీ నిబంధన కింద ఎంత పరిమాణం పనులు తొలగించారు? కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం ఆ పనుల విలువ ఎంత? నామినేషన్‌పై కొత్త కాంట్రాక్టర్లకు ఎంత విలువకు అప్పగించారు? వాటికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీలు ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
- ఈపీసీ కాంట్రాక్టు ఒప్పందం రద్దు చేసుకోకుండా ఎల్‌ఎస్–ఓపెన్ పద్ధతిలో పనులు అప్పగిస్తూ గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల పత్రాలను ఇవ్వాలని కోరారు.
- స్పెషల్ ఇంప్రెస్ట్ అమౌంట్, మొబిలైజేషన్ అడ్వాన్సుల చెల్లింపు, వసూలుకు సంబంధించిన రికార్డులు ఇవ్వాలని కోరారు.
- పూడికతీత, డీ వాటరింగ్, కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో ఎక్కడకెక్కడ పనులు చేశారు? ఎంత బిల్లులు చెల్లించారు? అన్న వివరాలు ఇవ్వాలని కోరారు.
పోలవరం హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువల ఎస్‌ఈల నుంచి ఈ రికార్డులను స్వాధీనం చేసుకున్న తర్వాత క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి అక్రమాల నిగ్గు తేల్చనున్నారు. పనుల నాణ్యతను పరిశీలించనున్నారు. పనులను పర్యవేక్షించిన అధికారులతో రాతపూర్వకంగా వివరణ తీసుకుని విజిలెన్స్ విభాగం సమగ్ర నివేదికను డీజీకి సమర్పిస్తుంది. విజిలెన్స్ డీజీ వీటిని క్రోడీకరించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment