పోలవరంలో సాంకేతిక అద్భుతం | Technical Miracle In Polavaram | Sakshi
Sakshi News home page

పోలవరంలో సాంకేతిక అద్భుతం

Published Mon, Jan 4 2021 4:17 AM | Last Updated on Mon, Jan 4 2021 1:07 PM

Technical Miracle In Polavaram - Sakshi

ఆలమూరు రామగోపాలరెడ్డి, పోలవరం ప్రాజెక్టు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పోలవరంలో మరో సాంకేతిక అద్భుతం ఆవిష్కృతమవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ సిలిండర్లతో పనిచేసే గేట్ల బిగింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం స్పిల్‌ వేను పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. స్పిల్‌ వే మీదుగా వరదను దిగువకు మళ్లించి ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) పనులను నిర్విఘ్నంగా కొనసాగించడం ద్వారా శరవేగంగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. 2022 ఖరీఫ్‌ సీజన్‌లో కాలువలకు నీటిని విడుదల చేయడం ద్వారా పోలవరం ఫలాలను రైతులకు అందించేలా ప్రణాళిక రూపొందించింది. ఈ క్రమంలో తాజాగా భారీ క్రేన్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్పిల్‌ వేకు గేట్ల బిగింపు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌ వేకు 48 గేట్లను బిగించనున్నారు. ప్రపంచంలో గరిష్ట వరద ప్రవాహం విడుదల చేసే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు పోలవరమే కావడం గమనార్హం.

పునాదికి తలుపులు బిగించి...
ఇది.. పోలవరం స్పిల్‌ వే. 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 దాకా టీడీపీ హయాంలో సగటున 22 మీటర్ల స్థాయి వరకు మాత్రమే స్పిల్‌ వే పనులను చేయగలిగారు. స్పిల్‌ వే పియర్స్‌(స్తంభాలు)కు 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల మధ్య 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను బిగించాలి. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఐదేళ్లలో స్పిల్‌ వే పునాది పనులను మాత్రమే గత సర్కార్‌ చేసింది. ఎవరైనా పునాదికి తలుపులు బిగించేసి ఇంటి నిర్మాణం పూర్తయిందంటే నమ్ముతారా? చంద్రబాబు మాత్రం సరిగ్గా అలాంటి డ్రామానే ఆడారు. పోలవరం స్పిల్‌ వేలో 42, 43 పియర్స్‌ మాత్రమే 34 మీటర్ల ఎత్తు వరకు అప్పట్లో చేశారు. ఆ రెండు పియర్స్‌ మధ్య నాలుగు స్కిన్‌ ప్లేట్ల(ఇనుపరేకులు)ను అతికించి అడ్డంగా నిలబెట్టి గేటు బిగించేసినట్లు, ప్రాజెక్టు పూర్తయినట్లుగా నమ్మించేందుకు 2018 డిసెంబర్‌ 24న తనదైన శైలిలో ప్రయత్నించారు. గత సర్కార్‌ స్పిల్‌ వేకు అతికించింది అర గేటు మాత్రమే. అదికూడా కొన్నాళ్లకే గాలి ఉధృతికి స్పిల్‌ వే పునాదిపై నుంచి కిందకు పడిపోయింది.

ప్రతికూల పరిస్థితుల్లోనూ పరుగులు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరద ఉద్ధృతి, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం స్పిల్‌ వే 53 బ్లాక్‌లను 55 మీటర్ల ఎత్తుకుగానూ ఇప్పటికే సగటున 54 మీటర్ల ఎత్తు వరకు పూర్తి చేసింది. స్పిల్‌ వే బ్రిడ్జి నిర్మాణంలో 48 స్లాబ్‌లకుగానూ 40 పూర్తయ్యాయి. డిసెంబర్‌ 17 నుంచి ఈనెల 1 వరకు అంటే కేవలం 16 రోజుల్లో తొమ్మిది గేట్లను బిగించారు. తాజాగా మరో రెండు గేట్ల బిగింపు ప్రక్రియ ఆదివారం రాత్రికి పూర్తవుతుంది. 

గేట్లను ఎలా అమర్చుతారంటే..?
► భారీ క్రేన్‌లతో ఆర్మ్‌ గడ్డర్లను ఎత్తి పియర్స్‌లో నిర్మించిన ట్రూనియన్‌ బీమ్‌కు బిగిస్తారు. రెండు పియర్స్‌ ట్రూనియన్‌ బీమ్‌ బ్రాకెట్లకు ఒక్కో దానికి నాలుగు ఆర్మ్‌ గడ్డర్ల చొప్పున బిగిస్తారు. రెండు పియర్స్‌కు బిగించిన ఆర్మ్‌ గడ్డర్స్‌ను హారిజాంటల్‌ గడ్డర్స్‌తో అనుసంధానం చేస్తారు.
► భారీ క్రేన్ల సహకారంతో ఎనిమిది స్కిన్‌ ప్లేట్లను ఎత్తి రెండు పియర్స్‌కు అమర్చిన ఆర్మ్‌ గడ్డర్స్, హారిజాంటల్‌ గడ్డర్స్‌ మధ్య ఎగువన నాలుగు స్కిన్‌ ప్లేట్లు(ఎలిమెంట్స్‌), దిగువన నాలుగు స్కిన్‌ పేట్లను అతికిస్తారు. స్కిన్‌ ప్లేట్ల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా వెల్డింగ్‌ చేస్తారు. ఈ గేటు అర్థచంద్రాకారంలో ఉంటుంది.
► పియర్స్‌కు 45 మీటర్ల ఎత్తు వద్ద డౌన్‌ స్ట్రీమ్‌లో పాల్కన్స్‌ బిగిస్తారు. రెండు పియర్స్‌కు ఏర్పాటు చేసిన పాల్కన్స్‌.. గేటు అడుగున ఉన్న హారిజాంటల్‌ గడ్డర్‌కు అమర్చిన బ్రాకెట్‌ మధ్య స్పిల్‌ వేకు ఇరువైపులా డౌన్‌ స్ట్రీమ్‌లో రెండు హైడ్రాలిక్‌ సిలిండర్లను బిగిస్తారు.
► స్పిల్‌ వే బ్రిడ్జిపైన హైడ్రాలిక్‌ సిలిండర్‌ హాయిస్ట్‌ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఒక గేటు బిగించే ప్రక్రియ పూర్తయినట్లు లెక్క. వరద విడుదల చేయాలనుకున్నప్పుడు హైడ్రాలిక్‌ హాయిస్ట్‌ బటన్‌ నొక్కుతారు. గేటుకు అడుగున హారిజాంటల్‌ గడ్డర్‌కు ఇరువైపులా బిగించిన హైడ్రాలిక్‌ బ్రాకెట్‌కు అమర్చిన సిలిండర్‌ సహకారంతో గేటుపైకి లేస్తుంది.
► జర్మనీకి చెందిన మాన్‌టన్‌ హైడ్రాలిక్స్‌ సంస్థ నుంచి ఇప్పటికే 46 హైడ్రాలిక్‌ సిలిండర్లను దిగుమతి చేసుకున్నారు. మరో 18 విశాఖ పోర్టుకు వారంలో చేరుకోనున్నాయి. మిగతావి ఫిబ్రవరికి పోలవరం చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement