ఆదివారం జిల్లాలో షర్మిల సమైక్య శంఖారావం బస్సుయాత్ర జరగనుంది. కడప జిల్లా బద్వేల్ నుంచి ఉదయం 9 గంటలకు షర్మిల నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఆదివారం జిల్లాలో షర్మిల సమైక్య శంఖారావ ం బస్సుయాత్ర జరగనుంది. కడప జిల్లా బద్వేల్ నుంచి ఉదయం 9 గంటలకు షర్మిల నెల్లూరు జిల్లాలో ప్రవేశిస్తారు. ఉదయం 10 గంటలకు ఆత్మకూరు బస్టాండు సెంటర్లో జరిగే సభలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం సంగం మీదుగా యాత్ర బుచ్చిరెడ్డిపాళేనికి చేరుకుంటుంది. 3 గంటలకు బుచ్చిరెడ్డిపాళెంలో జరిగే సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఆ తరువాత రాజుపాళెం మీదుగా యాత్ర కావలికి చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటలకు కావలిలో జరిగే సభలో షర్మిల ప్రసంగిస్తారు. షర్మిల యాత్రకు జిల్లా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి.
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు షర్మిలకు ఘనస్వాగతం పలకనున్నారు. సెప్టెంబర్ 2న తిరుపతిలో ప్రారంభమైన షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పూర్తి చేసుకుని ఆదివారం నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది. రాత్రికి ఆమె కావలిలో బస చేస్తారు. వినాయకచవితి సందర్భంగా సోమవారం యాత్రకు విరామం. తిరిగి మంగళవారం ప్రకాశం జిల్లాలో యాత్ర ప్రారంభం కానుంది.