నెమ్మిపాటి.. ఘనాపాటి | To day women's day grand celebrations | Sakshi
Sakshi News home page

నెమ్మిపాటి.. ఘనాపాటి

Published Sat, Mar 8 2014 3:44 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

To day women's day grand celebrations

కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: ఆ ఇంట్లో ముగ్గూరూ ఆడపిల్లలే. తండ్రి వారిని ఎన్నడూ ఆడ పిల్లలుగా పెంచలేదు. మగాళ్లే అనుకుంటూ పౌరుషాన్ని, ధైర్యాన్ని, ఆత్మ స్థైర్యాన్ని బాల్యం నుంచే నూరిపోశాడు. చేరుకోవాల్సిన గమ్యాన్ని, సాధించాల్సిన లక్ష్యాన్ని నిర్దేశించాడు. సాదాసీదా బతుకు కాదు.. సాధించి తీరుతా అనే భావన ఉండాలన్నాడు. మామూలు జీవితం కాదు. మట్టిలో మాణిక్యాల్లా రాణించాలన్నాడు.
 
 పుట్టిన మట్టి వాసనను మరువొద్దన్నాడు. కన్న ఊరికి, ఇంటికీ పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా ఆకాశమే హద్దుగా ఎదగాలన్నాడు. వెన్ను తట్టిన తండ్రి ప్రోత్సాహాన్ని అంది పుచ్చుకున్న ఆ తనయ తమస్సుతో పోరాడారు. తపస్సుతో సాధించారు. ఆ ఇంటికే నవోషస్సుగా నిలిచారు.కర్నూలు జిల్లా బొల్లవరంలో పుట్టి పెరిగి కర్నూలు నగరంలోని ఈసీఎం ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని షాట్‌ఫుట్, డిస్కస్ త్రో, హ్యామర్‌త్రో.. వెయిట్ లిఫ్టింగ్‌లలో జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించారు. మే నెలలో జపాన్‌లో జరగనున్న అథ్లెటిక్స్ మీట్‌కు భారతదేశ ప్రతినిధిగా పాల్గొననున్నారు. అంతేగాదు పెయింటింగ్‌లో టైలరింగ్ లో, ఫ్యాషన్ డిజైనింగ్‌లో, క్యాటరింగ్(రుచికరమైన వంటల్లో) తనదైన శైలిలో రాణించి అందరితో శెభాష్ అనిపించుకుని అన్ని రంగాల్లో ఘనాపాటిగా నిలిచిన నెమ్మిపాటి లక్ష్మీదేవి కథనం మహిళలందరికీ స్ఫూర్తిదాయకం.
 
  బొల్లవరంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో నెమ్మిపాటి లక్ష్మీదేవి జన్మించారు. తల్లి వెంకమ్మ తండ్రి కృష్ణారెడ్డిలు ఈమెను బాల్యం నుంచి అన్ని రంగాల్లో రాణించాలని ప్రోత్సహించారు. ముగ్గురు ఆడపిల్లలే కావడంతో తండ్రి కృష్ణారెడ్డి వాళ్లను ప్రేమతో ధైర్యం కలిపి పెంచారు. కర్నూలు ఈసీఎం స్కూల్‌లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివిన ఈమె ఆ పాఠశాలలోనే కబడ్డీలో ఉత్తమ క్రీడాకారిణిగా రాణించారు. 1981 నుండి 1990 వరకు తొమ్మిదిసార్లు జాతీయ స్థాయి కబడ్డీలో విజేతగా నిలిచి మెడల్స్ అందుకున్నారు.
 
 కబడ్డీ, అథ్లెట్స్‌లో 150 మెడల్స్...
 రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో జరిగిన కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఈమె మొత్తంగా 150 మెడల్స్ సాధించడం విశేషం. 1986లో ఈమె వివాహానంతరం కబడ్డీ ఆటకు చుక్క పెట్టి అథ్లెటిక్స్ వైపు వెయిట్ లిఫ్టింగ్ వైపు దృష్టి సారించారు. 1991లో ఈమె పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పో లీసు మీట్‌లలో ఉత్తమ అథ్లెట్‌గా రాణించి పలువురు జాతీయ స్థాయి క్రీడాకారుల ప్రశంసలు పొందారు.
 
 అన్ని రాష్ట్రాల్లోని క్రీడా పోటీల్లో..
 భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరిగిన క్రీడా పోటీల్లో ఈమె పాల్గొన్నారు. ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో జరిగిన ప్రధాన క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిసారి పతకం సాధించుకొచ్చారు. పాఠశాల స్థాయిలో తనకు ప్రోత్సాహమిచ్చిన కళా ప్రపూర్ణ టీచరంటే తనకు చాలా ఇష్టమని, ఇప్పటికీ ఆమెను కలిసి ఆశీస్సులు పొందుతుంటానని లక్ష్మిదేవి న్యూస్‌లైన్‌తో చెప్పారు.
 
 టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లపై ప్రత్యేక ఆసక్తి..
 క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన లక్ష్మీదేవి పోలీసు మీట్స్‌కు వెళ్లినప్పుడు పలు శిక్షణ  కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ విధంగా ఆమెకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, రుచికరమైన వంటకాలపై ఆసక్తి కలిగింది. ఈ రంగాల్లోను ప్రత్యేక దృష్టి సారించి ఈమె ప్రస్తుతం కొంతమంది మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్‌లలో ఉపాధి చూపిస్తున్నారు. పలు రకాల పచ్చళ్ల తయారీ, చికెన్ వెరైటీ వంటకాలలోను ఈమె శిక్షణనివ్వగలరు.
 
 సంకటి, సద్దన్నమే...బలాన్నిచ్చాయి: లక్ష్మీదేవి
 నేను చిన్నప్పు్పడు మా పల్లెలో తిన్న సంకటి, సద్దన్నమే నాకు ఇంత బలాన్నిచ్చాయి. ప్రమాదంలో నా కుడి చేయికి గాయమై రెండు వ్రేళ్ల ఎముకలు దెబ్బతిన్నాయి. అయినా నేను వెనుకడుగు వేయలేదు. షార్ట్‌ఫుట్‌లో, డిస్కస్ త్రోలో, హామర్ త్రోలో బంగారు పతకాలు, సిల్వర్ పతకాలు సాధించాను. మే 2014లో జపాన్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్నాను. ఉత్తమ అంతర్జాతీయ క్రీడాకారణిగా రాణించాలన్నదే నా జీవిత ధ్యేయం.
 
 ఎస్పీ అభినందన
 కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లా పోలీస్ శాఖ ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ విభాగంలో మహిళా హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎన్.లక్ష్మీదేవి జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. గత నెల ఫిబ్రవరి 20 నుంచి 24వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగిన 35వ మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో లక్ష్మిదేవి పాల్గొన్నారు. డిస్కస్ త్రోలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం, హ్యామర్ త్రోలోను మొదటి స్థానంతో బంగారు పతకం, జావెలిన్ త్రోలో రెండో స్థానంతో వెండి పతకం సాధించారు. కర్నూలు జిల్లా పోలీస్ శాఖ నుంచి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని స్వర్ణ, రజత పతకాలు సాధించడంతో పాటు జపాన్‌లో జరిగే అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైన లక్ష్మిదేవిని జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి, అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ రాధాక్రిష్ణ, ఇతర పోలీసు అధికారులు అభినందించారు. కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారని ఆమెను పోలీసు అధికారులు కొనియాడారు. వచ్చే నెలలో జపాన్‌లో జరిగే క్రీడల్లో కూడా ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఏఆర్ డీఎస్పీ రుషికేశవరెడ్డి, ఆర్‌ఐలు రెడ్డప్పరెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement