నేటి అర్ధరాత్రి నుంచి మున్సిపల్ సేవలు బంద్
Published Tue, Feb 11 2014 1:58 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: శ్రీకాకుళం జిల్లాలో మున్సిపాలిటీల సేవలు మంగళవా రం అర్ధరాత్రి నుంచి బంద్ కానున్నాయి. మున్సిపల్ ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. సోమ, మంగళవారాల్లో కేవలం పెన్‌డౌన్ ప్రకటిస్తూ నిరసన తెలిపిన మున్సిపల్ ఉద్యోగులు, తాజా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు పూర్తిగా విధులకు గైర్హాజరుకానున్నారు. దీంతో జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, రాజాం,
పాలకొండ మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇప్పటికే వేతనాలు పెంచాలని, ఉద్యోగభత్ర కల్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ పారిశద్ధ్య కాంట్రాక్టు కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్యోగులు కూడా సమ్మెలోకి రావడంతో పట్టణ ప్రజలు బెంబెలెత్తుతున్నారు. సోమవారం నుంచి విద్యుత్ దీపాల నిర్వహణ, తాగునీరు సరఫరా విభాగాల సేవలను కూడా పూర్తిగా నిలిపివేశారు. మున్సిపల్ కమిషనర్లతో పాటు ఇంజనీరింగ్ అధికారులు, సహాయ కమిషనర్లు కూడా సమ్మెలోకి వెళ్లనున్నారు.
నిరవధిక సమ్మెలో పాల్గొనండి...
జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లోనూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి నుంచి విధులను నిలిపివేస్తూ నిరవధిక సమ్మెలో దిగుతున్నట్లు స్థానిక మున్సిపల్ ఉద్యోగుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్. సింహాచలం, ఐ.గౌరి శంకర్‌లు తెలిపారు.
Advertisement