శ్రీకాకుళం టౌన్, న్యూస్‌లైన్ : ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శనివారం పర్యటించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు చంద్రబాబు ఇచ్ఛాపురం చేరుకుంటారని, అక్కడ పర్యటించాక పలాస నియోజకవర్గానికి వెళతారని వివరించారు. సాయంత్రం శ్రీకాకుళంలో పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. రాత్రికి శ్రీకాకుళంలోనే బస చేస్తారని, ఆదివారం ఉదయం శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గా ల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో సంభవించిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.
మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, కింజరాపు రామ్మోహన్ నాయుడులు మాట్లాడుతూ సీఎం కిరణ్ జిల్లా పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. నష్టాల అంచనాలో రాజకీయ జోక్యం ఉండడం దురదృష్టకరమన్నారు. గుర్తింపు కార్డుల్లేని మత్స్యకారులకు నష్టపరిహారం అందించటంలో అన్యాయం జరుగుతోందన్నారు. సమావేశంలో కొర్ను ప్రతాప్, పి.వి.రమణ, మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, ఎస్వీ రమణ మాదిగ, అరవల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
నిరాశ నడుమ..
జిల్లాలో చంద్రబాబు పర్యటన నిరాశ నిస్పృహల నడుమ సాగుతుం దనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆయన పర్యటనకు పార్టీ క్యాడర్ దూరంగా ఉండనుందని సమాచారం. సమైక్యాంధ్ర విషయంలో స్పష్టత ఇవ్వని ఆయనకు మద్దతివ్వడం సరికాదని కార్యకర్తలు భావిస్తున్నారు. ఫలితంగా ఆయనకు చేదు అనుభవం ఎదురవక తప్పదని పరిశీలకులు అంటున్నారు. సమైక్యవాదులు ఆయన పర్యటనను అడ్డుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కాగా, శ్రీకాకుళంలో చంద్రబాబు నిర్వహించనున్న సమీక్షకు సైతం దూరంగా ఉండాలని కొందరు నాయకులు భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ అధినేత ఏకపక్ష ధోరణే దీనికి కారణమని సమాచారం. అంతేకాకుండా కిమిడి, కింజరాపు వర్గాల ఆధిపత్య పోరులో నలిగిపోతున్నామని మరికొందరు వాపోతున్నారు.
నేడు చంద్రబాబు పర్యటన
Published Sat, Oct 26 2013 2:40 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
Advertisement
Advertisement