ఒక వ్యక్తి ఆహారం లేక పోయినా కొన్ని రోజులపాటు జీవించగలడు. ఏ కారణాల వల్ల అయినా రక్తం కోల్పోయిన వ్యక్తికి కొన్ని గంటల వ్యవధిలో అవసరమైన రక్తం ఎక్కించక పోతే ప్రాణాలు కోల్పోతాడు. అటువంటి వారికి మనం స్వచ్ఛందంగా చేసిన రక్తదానమే పునర్జన్మను ఇస్తుంది. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటంతోపాటు, రక్తదాతలు ఆరోగ్యకరంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తదానంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు 1975 నుంచి ఏటా అక్టోబరు ఒకటో తేదీని జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
విజయవాడ, న్యూస్‌లైన్ : వైద్య విజ్ఞాన రంగం ఎంత అభివృద్ధి చెందినా రక్తానికి ప్రత్యామ్నాయం గానీ, కృత్రిమంగా తయారు చేసే పక్రియను కనుగొనలేకపోయారు. ఒకరు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే మరొకరికి జీవితాన్ని ప్రసాదించవచ్చు. జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకని పరిస్థితి నెలకొంది. ఏటా జిల్లాలో 60 వేల నుంచి 65 వేల యూనిట్ల రక్తం అవసరమవుతుండగా, వాటిలో 75 శాతం వరకూ స్వచ్ఛంద రక్తదానం ద్వారా సేకరిస్తున్నారు. మిగిలిన 25 శాతాన్ని రిప్లేస్‌మెంట్ ద్వారా సేకరిస్తున్నారు.
రక్తదాతల్లో 95 శాతం మంది పురుషులు ఉండగా, కేవలం 5 శాతం మంది మాత్రమే మహిళలు రక్తదానం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వరకు బ్లడ్ బ్యాంకులు ఉండగా, వాటి ద్వారా 2012-13 ఆర్థిక సంవత్సరంలో 60,417 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వీటిలో నగరంలోని లయన్స్ డిస్ట్రిక్ట్ బ్లడ్ బ్యాంకు 20 వేల యూనిట్లు, రెడ్‌క్రాస్ 6,542, చైతన్య బ్లడ్ బ్యాంకు 3,500 యూనిట్లు, ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకులో 2,475 యూనిట్లు సేకరించాయి. మరో నాలుగు బ్లడ్ బ్యాంకుల నుంచి 18 వేల వరకు సేకరించారు.
మచిలీపట్నంలోని రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకులో 1,400, ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకులో 8,500 యూనిట్లు సేకరించారు. అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ బ్యాంకుల్లో కొన్ని గ్రూపుల రక్తం దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. తక్కువ మందిలో ఉండే ఏబీ పాజిటివ్, ఏబీ నెగటివ్ గ్రూపుల రక్తం కోసం రోగుల బంధువులు అష్టకష్టాలు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిలో 50 మంది సకాలంలో రక్తం అందక మృత్యువాత పడుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర కొరత
నగరంలోని ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు తక్కువగా ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. ప్రమాదాలకు గురైన వారు తొలుత ప్రాణాపాయస్థితిలో ప్రభుత్వాస్పత్రికి వస్తుం టారు. వారికి సకాలంలో రక్తం ఎక్కించకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఆస్పత్రిలో ఏడాదికి 5,500 నుంచి 6,000 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతుండగా, కేవలం గత ఏడాది 2,475 యూనిట్లు మాత్రమే దాతల నుంచి సేకరించగలిగారు.
రక్తదాతలు ముందుకు వస్తున్నప్పటికీ బ్లడ్ బ్యాంకుకు పూర్తిస్థాయి మెడికల్ ఆఫీసర్ లేకపోవడం, శిబిరాల నిర్వాహణకు బడ్జెట్ కొరత కారణంగా రక్తం కొరత ఏర్పడుతోంది. గతేడాది ప్రభుత్వాస్పత్రి అంబులెన్స్‌కు ఇంధనం కూడా లేకవడంతో కేవలం ఐదు క్యాంపులు మాత్రమే నిర్వహించి 325 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. మిగిలిన 2,150 యూనిట్లను దాతలే ఆస్పత్రికి వచ్చి ఇవ్వడం విశేషం. ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి ఇంత దయనీయంగా ఉండటంతో తీవ్ర రక్తహీనతతో ప్రసవం కోసం వచ్చిన మహిళల బంధువులు రక్తం కోసం ఇతర బ్లడ్ బ్యాంకులకు అర్ధరాత్రిళ్లు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొందని సిబ్బందే చెబుతున్నారు.
రక్తదానం ఎవరు చేయవచ్చంటే..
ఆరోగ్య వంతులైన 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు వారు రక్తదానం చేయవచ్చు. 50 కిలోల బరువు పైబడి ఉన్నవారు తమ శారీరక బరువు కిలోగ్రాముకి 8 మిల్లీ లీటర్ల రక్తాన్ని దానం చేయవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒక యూనిట్ రక్తం దానం చేయడం వలన ఎటువంటి అనారోగ్యానికి గురికారు. అలా చేస్తే మరింత ఆరోగ్యకరంగా జీవించవ్చని నిపుణులు చెబుతున్నారు.
రక్తదానంపై భయాందోళన
దేశ జనాభాల్లో 50 శాతం మంది రక్తదానం చేసేందుకు అర్హత ఉన్నా కేవలం ప్రతి వెయ్యి మందిలో నలుగురు మాత్రమే చేస్తున్నారు. ఇందుకు అనేక అపోహలతోపాటు, భయాందోళనలే కారణం. విద్యార్థులకు రక్తదానం చేయాలని ఉన్నా తల్లిదండ్రులు ఏమైనా అంటారేమోననే ఆందోళనతో ముందుకు రావడం లేదు. ఒకరికి వాడిన సూదులు మరొకరికి వాడతారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రక్తదానం విషయంలో అపోహలు వీడి స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
- డాక్టర్ మదన్‌మోహన్, రెడ్‌క్రాస్ మెడికల్ ఆఫీసర్
రక్తదానమూ.. ఆరోగ్యకరమే..
Published Tue, Oct 1 2013 1:55 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement