ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికి పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎ-1 నిందితుడిగా చేర్చాలనే
నియోజకవర్గ కేంద్రాల్లో నేడు వైఎస్సార్‌సీపీ నిరసన
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపై
ఏసీబీ కేసు నమోదు చేయాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికి పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎ-1 నిందితుడిగా చేర్చాలనే డిమాండుతో వైఎస్సార్ కాంగ్రెస్ మంగళవారం జిల్లావ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ సోమవారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసిన చంద్రబాబు తీరుపై జిల్లాలోని 19 నియోజకవర్గ కేంద్రాల్లో కలిసి వచ్చే ఇతర పార్టీలు, ప్రజాస్వామ్యవాదులతో ర్యాలీలు, ధర్నా లు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులతో చంద్రబాబు పాత్ర ప్రజలకు స్పష్టంగా తెలిసినా, ఇంకా బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నారని నెహ్రూ ధ్వజమెత్తారు.
ఈ విషయంపై గ్రామగ్రామానా అవగాహన కల్పించేం దుకు పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్యవాదులతో కలిసి పని చేయాలన్నారు. తన స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బాబు ఈ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారని ఆక్షేపించారు. ఓటుకు నోటు వ్యవహారం పూర్తిగా టీడీపీకి, చంద్రబాబుకు సంబంధించినదే తప్ప, రెండు రాష్ట్రాల మధ్య సమస్య కానేకాదని, చిన్న పిల్లాడిని అడిగినా ఈ విషయం చెప్పేస్తాడని అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆయనతోపాటు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సాక్ష్యాధారాలతో తెలంగాణ ప్రభుత్వానికి దొరికిపోయారని, దీంతో మరోదారి లేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెలుగు ప్రజల మధ్య బాబు మరోసారి చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. రెండు పార్టీల మధ్య వివాదాన్ని, రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మలిచి దీనినుంచి బయటపడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎత్తుగడలను చిత్తు చేసేందుకు పార్టీ శ్రేణులు అప్రమత్తమై, అన్నిచోట్లా ఆయన మాయాజాలాన్ని ఎండగట్టాలని నెహ్రూ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుపై ఏసీబీ కేసు నమోదు చేసేవరకూ దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.