టోల్..బెంబేల్ | Toll plaza | Sakshi
Sakshi News home page

టోల్..బెంబేల్

Mar 14 2015 2:22 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడు జాతీయరహదారిపై టోల్‌ప్లాజా నిర్మాణం అన్యాయమని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.

టోల్‌ప్లాజా నిర్మాణం అన్యాయం..
 నెల్లూరు(సెంట్రల్) : నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడు జాతీయరహదారిపై టోల్‌ప్లాజా నిర్మాణం అన్యాయమని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జీరో అవర్‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శుక్రవారం మాట్లాడారు. నెల్లూరు-కనుపర్తిపాడు సమీపంలో హైవేపై ఏర్పాటు చేస్తున్న టోల్‌ప్లాజా నేషనల్ హైవే నిబంధనలకు పూర్తిగా విరుద్ధమన్నారు. ఒక టోల్‌ప్లాజాకు మరో టోల్‌ప్లాజాకు 60 కి.మీ ఉండాలని, ఈ లోపల మరో టోల్‌ప్లాజా ఉండకూడదు అనే నిబంధన ఉందన్నారు. కావలి నుంచి తడ వరకు నాలుగు టోల్‌ప్లాజాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఒక్కొక్క టోల్‌ప్లాజా మధ్య 60 కి.మీ దూరం ఉండాలని ఇప్పటికే జిల్లా ప్రజల మీద 4 టోల్‌ప్లాజాల భారం పడుతుందన్నారు.
 
 అలాంటిది ఇప్పుడు ఏర్పాటు చేయనున్న టోల్‌ప్లాజాకు వెంకటాచలం స్వర్ణా టోల్‌ప్లాజాకి మధ్య దూరం కేవలం 16 కి.మీ మాత్రమే ఉందన్నారు. ఇప్పుడు కొత్త టోల్‌ప్లాజాతో నెల్లూరునగరవాసులపై పెనుభారం పడుతుందని ఆందోళన చెందారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి తక్షణమే టోల్‌ప్లాజా నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఒక్కసారి టోల్ ఫీజు వసూలు చేస్తే నేషనల్ హైవే నిబంధనల ప్రకారం ఆపే హక్కులేదని, అందువల్ల టోల్ వసూలు చేయకముందే ఆపివేయాలన్నారు. ఈ రోజు టోల్‌ప్లాజా నిర్మాణాన్ని ఆపకపోతే ఇకపై ఆపలేమని ఆందోళన చెందారు. ఇటీవల ఆ ప్రాంతంలో కడుతున్న టోల్‌ప్లాజాను ఆపాలని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కోరామని, దానికి అందరూ సహకరించారన్నారు.

 రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ కూడా టోల్‌ప్లాజాను ఆపివేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి టోల్‌ప్లాజా ఏర్పాటు అన్యాయని, రాతపూర్వకంగా కూడా నేషనల్ హైవే అధికారులను కోరారని, అయినా కూడా టోల్‌ప్లాజా ఏర్పాటు జరుగుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టోల్‌ప్లాజా నిర్మాణాన్ని ఆపివేయాలని కోరారు. దీనికి స్పందించిన రవాణాశాఖ మంత్రి సిద్దా రాఘవరావు వెంటనే ఈ టోల్‌ప్లాజా నిర్మాణాన్ని ఆపివేస్తానని హామీ ఇచ్చారని తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement