ఎర్రగా..చూడగానే కొనాలనిపించే టమాటా ఈ రబీ సీజన్‌లో రైతులపాలిట విలన్‌గా మారింది. చెట్టునుంచి కోయకుండానే ‘ఢామ్మని’ పేలిపోయే పరిస్థితి ఏర్పడింది. కొద్ది నెలల కిందట వరకూ మంచి ధర పలికిన పంట ఇప్పుడు తీవ్రంగా పతనమై ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యాయి. పెట్టుబడులకే ఎసరొచ్చి అప్పుల ఖాతా పెరిగి అన్నదాతలు సాగంటే భయపడేలా మారింది. దీనికి అకాల వర్షం తోడై పూడ్చుకోలేని నష్టం తెచ్చి పెట్టింది.
మహబూబ్‌నగర్ వ్యవసాయం/కొందుర్గు, న్యూస్‌లైన్: కర్షకుడి కష్టాలు అంతా ఇంతా కాదు. ఆరుగాలం శ్రమ దక్కక ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. బహిరంగ మా ర్కెట్లో టమాటా ధర రూ.2 నుంచి రూ.3 మాత్రమే పలుకుతుండడంతో సాగు కోసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు కుదేలవుతున్నారు. విత్తనాలు,ఎరువుల ధరలు, క్రిమి సంహారక మందుల ధరలకు రెక్కలు రావడంతో పెట్టుబడి అమాంతంగా పెరిగిపోయింది. ఒక ఎకరా విస్తీర్ణంలో సాగుకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు అవుతోంది.
శాపమైన వర్షాలు..
తాజాగా మార్కెట్‌కు పం ట తరలించే దశలో అకా ల వర్షం రైతులపాలిట శా పంగా మారింది. ఈ కారణంగా ఒక్క అలంపూర్, గద్వాల నియోజక పరిధిలోనే 100 హెక్టార్లలో ట మాటా పంటకు నష్టం వా టిల్లింది. అంతేకాకుండా వాతావరణంలో మార్పులు వచ్చి గాలులు వీయడంతో టమాట పంట నేలకొరిగి పాడువుతున్నాయి. మార్కెట్లో ధరలేకపోవడంతో పాటు కూలీల చెల్లింపులకూ రైతులు నానా కష్టాలు పడుతున్నారు. దీంతో వారు పంటను తెంపించడానికి వెనకడుగు వేస్తున్నారు. కొంతమంది రైతులు ఈ అదనపు భారం తమకెందుకని పండ్లను తీయకుండానే వదిలేస్తున్నారు. మరికొందరూ వాటిని పశువులకు మేతగా వేస్తున్నారు.
హడలెత్తిస్తున్న అప్పులు...
ప్రస్తుతం పంట కారణంగా పెట్టుబడి కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో చేసిన అప్పులు ఎలా తీర్చాలా అని రైతులు లోలోపల మధనపడుతున్నారు. ఈ కారణంగా కొందరు బలవన్మరణాలను ఆశ్రయిస్తుండగా, మరికొందరు వలస బాట పడుతున్నారు. గత మూడునాలుగు నెలల కింద టమాటా ధర కిలో రూ.80 పలికింది. దీంతో రైతులు రబీలో ఈ పంటపై దృష్టి సారించారు. ధరలు ఒక్కే సారి పతనం కావడంతో వారికి దిక్కుతోచన పరిస్థితి ఎదురైంది. జిల్లాలో ఎక్కువగా కేశంపేట,కొందుర్గు, షాద్‌నగర్, జడ్చర్ల, బాలానగర్, హన్వాడ, గద్వాల, అలంపూర్, మల్దకల్, కల్వకుర్తి, వనపర్తి, ఆత్మకూర్, నారాయణపేట మండలాల్లో ఎక్కువగా సాగు చేశారు. దాదాపు 4వేల హెక్టార్లకు పైగా సాగుచేశారు.వీరందరి పరిస్థితీ ఆందోళనకరంగా ఉంది.
అమ్మో.. టమా‘ఠా’..!
Published Wed, Mar 5 2014 4:28 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement