రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు.
గుంటూరు సిటీ : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. ప్రజా విశ్వాసం కోల్పోయిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు పరచకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. అందుకే శుక్రవారం జిల్లా కేంద్రం గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ సీపీ మహాధర్నా చేపట్టిందని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమానికి రైతులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు హాజరై ప్రభుత్వంపై తమకు ఉన్న వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రుణ మాఫీ అమలు సాధ్యం కాదని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి చెబుతున్నప్పటికీ, స్వయంగా టీడీపీ అధినేత చంద్ర బాబుకు కూడా ఈ సంగతి తెలిసినప్పటికీ అబద్ధపు హామీతో అధికారంలోకి వచ్చిన సంగతి రైతులకు కూడా తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
బాబు వస్తే జాబు అన్న మాట కూడా నీటి మీద రాతేననీ, కొత్తగా ఒక్క జాబు కూడా ఇవ్వకపోయిన ఆయన ఉన్న ఉద్యోగాలు కూడా ఊడబీకుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన బాధ్యత నిజాయతీ గల ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీపై ఉందని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 5వ తేదీన మహా ధర్నాకు పిలుపునిచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ ధర్నాకు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలనీ, దీన్ని జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వంపై తమకు ఉన్న వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తం చేయాలనీ మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు.
వైఎస్సార్ సీపీ నేతలు అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆళ్ల పేరిరెడ్డి జిల్లాలోని వేర్వేరు చోట్ల మాట్లాడుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
మహాధర్నాకు ఆదర్శ రైతుల మద్ధతు
మహాధర్నాకు ఏ.పి.స్టేట్ ఆదర్శ రైతుల అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బుధవారం ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శేఖర్ ఆధ్వర్యంలో పలువురు ఆదర్శ రైతులు గుంటూరులో రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ను కలసి మహాధర్నాకు తమ పూర్తి సంఘీభావం ప్రకటించారు.