అన్నదాతకు మరో ఆపద వచ్చిపడింది. తుఫాను ప్రభావంతో బుధవారం కురిసిన వర్షం వారి ఆశలను అడియాసలు చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. కోతలు పూర్తయి ఆరబెట్టిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడ్డారు. కోత దశలో ఉన్న వేలాది ఎకరాల వరి పొలాలు నేలకొరిగాయి. వర్షం అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే దశలో తుపాన్ వర్షం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి చినుకులు ప్రారంభమయ్యాయి. వారం రోజుల నుంచి బోధన్ నియోజకవర్గంలోని బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాలలో వరి కోతలు మొదలయ్యాయి.
వరినూర్పిళ్లు ఊపందుకున్నాయి. పొలాలలో ధాన్యం కుప్పలు ఉన్నాయి. ఇవి వర్షానికి తడువకుండా ప్లాస్టిక్ సంచులు కప్పి ఉం చేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. ధా న్యం తడిస్తే రంగు మారి ధరపై ప్రభావం చూ పుతుందని రైతులు వాపోతున్నారు. చిన్ననీటి వనరులు, ఎత్తిపోతల పథకాలు, కరెంట్ బోరుబావుల కింద వేలాది ఎకరాలలో వరి సాగైంది. బోధన్ మండలంలోనే సుమారు 20 వేల ఎకరాలకు పైగా వరి పంట సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షానికి వందలాది ఎకరాలలో వరి నేలకొరిగింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో ఖరీఫ్‌పై పెంచుకున్న ఆశలు నీరుగారుతున్నాయి. గడిచిన రబీలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షానికి వరి, పొద్దు తిరుగుడు, పత్తి, మిర్చి పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు అపారంగా నష్టాలపాలయ్యారు. అప్పులు తెచ్చి ఖరీఫ్‌లో పంటలు సాగు చేశారు. ఇప్పు డు తుపాన్ వర్షంతో రైతులు బెంబెలెత్తిపోతున్నారు.
కామారెడ్డిలో
కామారెడ్డి నియోజకవర్గంలో కురిసిన వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నా రు. మక్కలను ఆరబెట్టిన సమయంలో ఒక్క సారిగా వర్షం కురవడంతో నష్టపోవాల్సి వస్తోంది. పట్టణంలోని గాంధీ గంజ్‌లో రైతులు తీసుకువచ్చిన మక్కలు కొట్టుకుపోయి రైతులు ఇబ్బందులపాలయ్యారు. నియోజకవర్గంలో నిమాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు,కామారెడ్డి మండలాల్లో మొక్కజొన్న రైతులు అవస్థలకు గురయ్యారు. చేతికొచ్చిన వరిపంటకు వర్షం మూలంగా దెబ్బతింటోందని రైతులు ఆందోళన వ్యక్త చేశారు. ఈ సారి భారీ వర్షాలు కురిసి పంటలు ఆశాజనకంగా ఉన్న పరిస్థితుల్లో రైతులు ఆనంద ంలో ఉండగా, ఒక్కసారిగా తుపాన్ రావడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది.
బాన్సువాడలో
బాన్సువాడ ప్రాంతంలో వేల ఎకరాలలో వరి పంట నేలకొరిగింది. భారీగా నష్టం వాటిల్లడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. బాన్సువాడ, బోర్లం, ఇబ్రాహీంపేట, బీర్కూర్, కొత్తాబాది తదితర గ్రామాలలో వరి పూర్తిగా నేలకొరిగింది. ఈ ప్రాంతంలోని ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజుల్లో వరి కోతలు ఊపందుకునే సమయంలోనే అకాల వర్షం పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో విత్తనాలు మొలకెత్తే అవకాశాలున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎల్లారెడ్డిలో
నియోజకవర్గంలో మధ్యాహ్నం నుంచి మోస్తరుగా ప్రారంభమైన వర్షం రాత్రికి భారీగానే కు రిసింది. ఎల్లారెడ్డి మండలంలో కొద్దిగా జల్లులు కురవగా నాగిరెడ్డిపేట మండలంలో సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురిసింది.
నిజాంసాగర్‌లో
మండలంలోని పలు గ్రామాలలో బుధవారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షంతో పంటలకు ఆపార నష్టం వాటిల్లింది. గ్రామాల్లో కోత కోసిన వరికుప్పలు, నూర్పిడి చేసి ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు పేర్కొన్నారు. సుమారు ఆరగంటకుపైగా సేపు కుండపోతగా వర్షం కురవడంతో కోతకు వచ్చిన వరి పంట నేల కొరిగింది. వర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వ పరంగా పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
ధర్పల్లిలో
మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. పంటలు తడిసి ముద్దయ్యాయి. వేల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లింది. వరి గింజలు రాలిపోయే పరిస్థితులు ఉన్నాయయి.
డిచ్‌పల్లిలో
డిచ్‌పల్లి మండలంలో పంటలు నేల కొరిగాయి. వడ్లను పొలాలలోనే కుప్పలుగా వేశారు. అవి పూర్తిగా తడిసిపోయాయి.పంట చేతికంద వచ్చే దశలో వర్షం కురవడంతో రైతులు అందోళనకు గురవుతున్నారు. సిరికొండలో మండలంలో వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి పూర్తిగా నేలవాలింది.
రైతు గుండెలో తుఫాన్
Published Thu, Oct 24 2013 2:28 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement