పంట నష్టపరిహారం అందక రైతుల అవస్థలు | farmers are not happy due loss of crop | Sakshi
Sakshi News home page

పంట నష్టపరిహారం అందక రైతుల అవస్థలు

Published Fri, Sep 27 2013 4:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

farmers are not happy due loss of crop

 సాక్షి, కొత్తగూడెం:
 ప్రకృతి విపత్తులు, అతివృష్టి, అనావృష్టి సంభవించినప్పుడు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్‌పుట్ సబ్సిడీ పథకానికి గ్రహణం పట్టింది. అధికారులు కంటితుడుపుగా పంట నష్టం అంచనా వేసి, ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకుంటున్నారు. ఏళ్ల తరబడి పరిహారం విడుదల కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విసిగి వేసారిన పలువురు సాగుపై ఆసక్తి చూపడం లేదు. నీలం, జల్ తుపాన్లు, ఇటీవల సంభవించిన గోదావరి వరదలే ఇందుకు నిదర్శనం.
 
 2009, 2010 సంవత్సరాల్లో వచ్చిన లైలా, జల్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో ప్రభుత్వం కాకిలెక్కలు వేసి కొండంత నష్టం జరిగితే గోరంత పరిహారం అందించింది. అలాగే 2011లో జిల్లా వ్యాప్తంగా కరువు నెలకొంది. అనావృష్టి కారణంగా వేసిన పంటలు ఎండిపోయాయి. దీనికి పరిహారంగా జిల్లాలో మొత్తం 2,96,789 మంది రైతులకు రూ.111.6 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. అయితే బ్యాంకు ఖాతాలు తెరవాలని, ఆన్‌లైన్‌లో తప్పులు ఉన్నాయన్న నెపంతో రెండేళ్ల పాటు రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకొని ఇప్పటికీ రూ. 17 కోట్లు పంపిణీ చేయకుండానే వదిలేశారు. 2012 నవంబర్‌లో సంభవించిన నీలం తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 3.18 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఏజెన్సీలో పలు మండలాల్లో రికార్డు స్థాయిలో కుండపోత వర్షం కురియడంతో  పత్తి చేతికందకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా 2,31,966 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లగా.. పదినెలలైనా నేటికీ పైసా కూడా పరిహారం అందలేదు. నీలం తుపాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాలల్లో పర్యటించి ‘ఇంతనష్టం ఎక్కడా జరగలేదు. నీలం తుపాన్ రైతులను నిండా ముంచింది’ అని మొసలి కన్నీరు కార్చారే తప్ప నష్టం అంచనా వేయించడం, రైతులకు పరిహారం ఇప్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు.
 
  కన్నెత్తి చూడని కేంద్ర బృందం..
 నీలం తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒక దశలో ఇక్కడ నష్టమేమీ వాటిల్లలేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇంత జరిగినా కళ్లారా చూసిన ముఖ్యమంత్రి కానీ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ నోరెత్తలేదు. దీంతో మొక్కుబడిగా పరిహారం అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కొండంత నష్టం జరిగితే గోరంత అంచనాలతో సరిపెట్టారు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలకు తీవ్రనష్టం వాటిల్లినా.. కేవలం 10,899.5 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని లెక్కల్లో చూపించారు. ఇందుకు జిల్లాలో మొత్తం 33,515 మంది రైతులకు పరిహారం చెల్లిస్తామని స్వయంగా అధికారులే ప్రకటించినా.. నేటికీ ఏ ఒక్కరికి కూడా  పరిహారం అందించలేదు. భద్రాచలం డివిజన్‌లో ఇటీవల గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో మూడుసార్లు వరదలు వచ్చి వేసిన పంటలన్నీ కొట్టుకుపోయాయి. అంతేకాకుండా రైతులు మళ్లీ సాగు చేయడానికి వీలు లేకుండా వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. అయితే 29 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని.. పరిహారం కోసం అధికారులు నివేదికలు పంపినా నేటికి దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు.
 
 పెంచిన ఇన్‌పుట్ సబ్సిడీ ఏదీ..?
 కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ ఇన్‌పుట్ సబ్సిడీని పెంచినట్లు గొప్పగా ప్రకటన చేసింది. వరి, వేరుశనగ, పత్తి, చెరకు, మిర్చి, ఉల్లి, బొప్పాయి, కూరగాయ పంటలకు హెక్టారుకు రూ.10,000,  మొక్కజొన్నకు రూ.8,333, జొన్న, సజ్జ, రాగి తదితర పంటలకు రూ.5000 చొప్పున నిర్ణయించారు. అయితే ఈ నష్ట పరిహారాల చెల్లింపులో ప్రభుత్వం ఓ మెలిక పెట్టింది. వంద శాతం పంటనష్టం జరిగితేనే పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పంట నష్టాలను గుర్తించే ప్రభుత్వ శాఖలు అరకొరగా జరిగినట్లు నివేదికలు అందజేస్తున్నాయి. పెరిగిన ఎరువుల ధరలు, విత్తనాలకు అనుకూలంగా నష్ట పరిహారం పెరగలేదు. అయితే జిల్లాలో ఏటా పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లుతున్నా.. ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ ఇన్‌పుట్ సబ్సిడీ రైతులుకు పూర్తి స్థాయిలో అందలేదు.
 
 కిరణ్ వచ్చినా కరుణ లేదు..
 సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన కణసాని రవికుమార్ అనే రైతుకు దమ్మపేట మండలం గణేష్‌పాడులో ఐదు ఎకరాల పొలం ఉంది. ఇందులో వరి సాగు చేశాడు. జల్ తుపాన్ కారణంగా సాగు చేసిన పంటంతా కొట్టుకుపోయింది. పంట సాగుకు రూ. 1.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. అలాగే 2012 నవంబర్‌లో వచ్చిన నీలం తుపాన్‌తో అదే భూమిలో మొలక దశలో ఉన్న మొక్కజొన్న చేనులో ఇసుక మేటలు వేసింది. నీలం తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటపొలాలను చూసేందుకు నవంబర్ 6న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లాకు వచ్చారు. ఆయన రైతులతో మాట్లాడేందుకు రవికుమార్ పొలంలోని ఇసుక మేటలపైనే వేదిక ఏర్పాటు చేశారు అధికారులు. సభ అనంతరం రవికుమార్ పొలాన్ని సీఎం చూశారు. అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటికే రూ. 60 వేలు పెట్టుబడి పెట్టి నాటిన మొక్కజొన్న మొలకొత్తగానే వరద ముంచెత్తింది. ఇలా రెండు సార్లు జల్, నీలం తుపాన్‌లతో నష్టపోయిన ఈ రైతుకు సీఎం స్వయంగా పరిశీలించినా పరిహారం మాత్రం నీటిమూటే అయింది. పంట సాగుకు అప్పు చేశామని, పరిహారం అందకపోతే వడ్డీలు కట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా  లేదని రవికుమార్ ఆవేదన చెందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement