వరుస తుఫాన్‌లతో అతలాకుతలమైన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, తక్షణం రైతుల రుణాలన్నీ రద్దుచేసి కొత్త రుణాలివ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రావు వెంకట జగ్గారావు డిమాండ్ చేశారు
కొత్తకోట(రావికమతం), న్యూస్‌లైన్: వరుస తుఫాన్‌లతో అతలాకుతలమైన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, తక్షణం రైతుల రుణాలన్నీ రద్దుచేసి కొత్త రుణాలివ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రావు వెంకట జగ్గారావు డిమాండ్ చేశారు. మంగళవారం మండల చెరకు రైతుల సంఘం నాయకుడు మడ్డు రాజిబాబు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయీ రైతు సదస్సు కొత్తకోటలో జరిగింది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ నీలం తుఫాన్ పంట నష్టపరిహారం ఇప్పటికీ రైతులకు అందలేదన్నారు. బ్యాంకు రుణాలు పారిశ్రామికవేత్తలు 82 శాతం అధికంగా పొందుతున్నారని, రైతులకు కేవలం 18 శాతం మాత్రమే అందుతున్నాయని తెలిపారు. రైతు ప్రైవేటు వడ్డీవ్యాపారుల వద్ద రుణాలు చేసి అప్పులపాలై నష్టపోతున్నారన్నారు.
ఈ సమస్యలపై 18, 19, 20 తేదీల్లో గుంటూరులో జరిగే కిసాన్ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు గంగా భవానీ, నూకునాయుడు, వారా నూకరాజు, మేకా సత్యనారాయణ, జి. జోగిరాజు తదితరులు పాల్గొన్నారు.