కడప అర్బన్, న్యూస్‌లైన్ః కడప కేంద్ర కారాగారం నుంచి శనివారం రాత్రి 25 మంది ఖైదీలు విడుదల అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్ర కారాగారాలలో శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలంటూ శనివారం రాత్రి 286 జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీఓ మేరకు రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో అర్హులైన వారందరి విడుదలకు రాత్రికి రాత్రే సన్నాహాలు చేశారు.
ఇందులో భాగంగా కడప కేంద్ర కారాగారంలో సత్ప్రవర్తన ఖైదీలను కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ గోవిందరాజు ఆధ్వర్యంలో విడుదల చేశారు. జీఓకు అర్హులైన 30మంది పేర్లతో కూడిన జాబితాను నవంబర్ 1వ తేదీ నాటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఆ జాబితా ఆమోదం పొంది అవసరమైన ప్రక్రియ శనివారానికి పూర్తవడంతో రాత్రికి రాత్రే వారిని విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. 30మంది జాబితాలో 25మందిని విడుదల చేశారు. మిగతా ఐదుగురిలో ఇద్దరు పెరోల్‌పై ఉన్నారు. మరో ఇద్దరు తమకు విధించిన జరిమానా కట్టలేక అలాగే ఉన్నారు. మరో ఖైదీ ఎన్.కృష్ణారెడ్డి(55) ఇటీవల పెరోల్‌పై వెళ్లి మరణించాడు. విడుదలైన 25మందిలో ఒకరు వృద్దుడు కాగా, మరొకరు వృద్ధ మహిళ ఉన్నారు.
అర్ధరాత్రి ఇబ్బందులు
సత్ప్రవర్తన ఖైదీలను శనివారం రాత్రి విడుదల చేయడంతో ఇబ్బందులు పడ్డారు. బంధువులకు సరైన సమాచారం అందకపోవడంతోపాటు వాహనాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.