బోల్తా పడిన ట్రాక్టర్ ట్రాలీ, మృతి చెందిన మణికుమారి, శంకర్‌దాదా
మదనపల్లె క్రైం : కూలి పనుల కోసం ఊరు గాని ఊరు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం అలుముకుంది. ట్రాక్టర్ బోల్తా పడడంతో యువతి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ, గుట్టకాడపల్లె సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద ఆదివారం జరిగింది. రూరల్ పోలీసులు, బాధితుల కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మేళ్లచెరువుకు చెందిన ఏసురత్నం(57) చిన్నచిన్న చెరువులు, కుంటలకు రాతి కట్టడం పనులు చేయడంలో దిట్ట. అతను తన కుమారుడు జయపాల్(21), కుమార్తె మణికుమారి(18)తో పాటు అదే గ్రామానికి చెందిన మరో రెండు కుటుంబాల వారిని వెంటతీసుకుని కర్నూలుకు వచ్చాడు.
అక్కడున్న స్నేహితుడు శంకర్‌దాదా(57)తో కలిసి ఆరు నెలల క్రితం మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీకి వచ్చారు. క్రిష్ణాపురం సమీపంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వద్ద గుడారాలు వేసుకుని ఏడాదిగా పనులు చేసుకుంటున్నారు. ఆదివారం వారంతా పనుల్లోకి దిగారు. ట్యాంకు పైభాగంలో రాతి కట్టడం, మోల్డింగ్ దిమ్మెల నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్‌లో లగేజి వేసుకుని కట్టపైకి వెళుతున్నారు. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ట్రాలీలో కూర్చున్న కూలీలంతా కింద పడ్డారు. మరికొందరు కిందకు దూకేశారు.
ట్రాలీలో ఉన్న సెంట్రింగ్ సామగ్రి మీద పడడంతో మణికుమారి(18) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఏసురత్నం(57), ఆయన కుమారుడు జయపాల్(21), అతని స్నేహితుడు శంకర్‌దాదా(57) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సహచర సిబ్బంది వేరొక వాహనంలో హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించాలని డాక్టర్లు సూచించారు. అక్కడికి వెళ్లే లోపే అతను మృతి చెందాడు. శంకర్‌దాదాకు భార్య కేశమ్మ, ఆరుగురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment