తెలుగు మహిళా నేత కారుకు అతికించిన ఎంపీ స్టిక్కర్
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా విమానాశ్రయ భద్రతా సిబ్బంది కఠినంగా వ్యవహరించక తప్పడం లేదు. ఇక్కడ వీఐపీలు, వీవీఐపీల పేరిట ఇష్టానుసారంగా కార్లు పార్కింగ్ చేసిన వారు అపరాధ రుసుం చెల్లించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. విమానాశ్రయ డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం భద్రతా సిబ్బందితో అధికారులు చర్యలు చేపట్టారు. విమానాశ్రయం ముందు పార్కింగ్ చేసిన వారి వాహనాలకు కళ్లాలు వేశారు.
దీంతో ఆ కార్లను డ్రైవర్లు స్టార్ట్ చేసినా.. ముందుకు కదలలేదు. ఇదేంటని వెతికితే బెట్లు కట్టిన కార్ల చక్రాలకు చట్రాలు బిగించేసి ఉన్నాయి. ఇలా నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన చాలా వాహనాలకు రూ. 3 వేల నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించారు. ఓ తెలుగు మహిళా నాయకురాలు కారుకు ఎంపీ స్టిక్కర్ అతికించుకుని వస్తే అదేదో ఎంపీ కారని భద్రతా సిబ్బంది భావించారు. అయితేనేం నిబంధనలకు వ్యతిరేకంగా పార్కింగ్ చేశారని ఆ కారు చక్రానికి తాళం వేసేశారు. రూ.3 వేలు చెల్లిస్తే గానీ కదలనీయలేదు. మరో చోట ఓ పోలీసు అధికారి వెంట వచ్చిన మరో వ్యక్తి కారును జరిమానా వేశారు. ఇలా.. విమానాశ్రయంలో పార్కింగ్ క్రమబద్ధీకరణ కట్టుదిట్టం చేయడానికి నిర్మోహమాటంగా భద్రతా సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment