
రెండుసార్లు విఫలమైనా పట్టువదల్లేదు..
ఇంటర్వ్యూ
సంకల్ప బలంతోనే ఐఏఎస్ సాధించా
వైద్యశాఖలో ఉద్యోగం చేస్తూ, కోచింగ్ లేకుండా లక్ష్యానికి చేరుకున్నా
సమాజానికి సేవ చేయాలనే తలంపే ముందుకు నడిపింది
మా నాన్న బలరామయ్యే స్ఫూర్తి
ట్రైనీ కలెక్టర్ గుమళ్ల సృజన
ప్రశ్న : ఐఏఎస్‌కు ఎలా సన్నద్ధమయ్యారు...?
జవాబు : నా చదవంతా హైదరాబాదులోనే కొనసాగింది. బీఏ సైకాలజీ డిగ్రీ హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్ హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీ, పీహెచ్‌డీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పూర్తి చేశాను. ఐఏఎస్ అధికారి కావాలనే సంకల్పంతో పట్టుదలతో చదివాను. పొలిటికల్ సైన్స్, సైకాలజీ సబ్జెక్టులను ఎంచుకుని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఎంత సబ్జెక్టు ఉంది, ఎన్ని గంటలు చదవాలి అన్న అంశాలను ముందస్తుగానే ప్రణాళిక రూపొందించుకుని రోజుకు ఆరు నుంచి ఏడు గంటల పాటు చదివాను. ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు.
ప్రశ్న : ఐఏఎస్ అధికారే ఎందుకు కావాలని అనుకున్నారు?
జవాబు : మా నాన్న బలరామయ్య ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ఐఏఎస్ అధికారికి ఎన్ని అధికారాలు ఉంటాయో, ప్రజాసమస్యలను పరిష్కరించడానికి ఎంత అవకాశం ఉంటుందో ఆయన పనిచేసినప్పుడే గమనించాను. ఆయన స్ఫూర్తితో నేను కూడా ఐఏఎస్ అధికారి కావాలనుకున్నా. ఆ సంకల్ప బలం నన్ను ముందుకు నడిపింది. ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా సివిల్స్ రాయడంతో తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమయ్యా. ఓ సంవత్సరం సివిల్స్ రాయకుండా గ్రూప్-1 పరీక్ష రాసి వైద్యశాఖలో ఉద్యోగం సాధించా. ఆ ఉద్యోగం చేస్తూనే ఆఖరి ప్రయత్నంగా 2013లో సివిల్స్‌రాసి 44వ ర్యాంకు సాధించా.
ప్రశ్న : రాజకీయాలపై మా అభిప్రాయం?
జవాబు : మా అమ్మ సుగుణశీల చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం పూడి గ్రామ సర్పంచిగా ఉన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అనేక మార్గాలున్నాయి. రాజకీయాల్లోకి వెళితే ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలనే పరీక్షలను ఎదుర్కోవాలి. అదే ఐఏఎస్ అధికారిగా ఏంపికైతే ప్రజాసేవ చేయడానికి 30 సంవత్సరాల సమయం ఉంటుంది. ప్రజాసమస్యలను అర్థం చేసుకుని నూతన పథకాలను ప్రవేశపెడితే దీర్ఘకాలంపాటు ప్రజలకు ఉపయోగ పడతాయనేది నా నమ్మకం.
ప్రశ్న : ఇంటర్వ్యూ ఎలా సాగింది..?
జవాబు : ఇంటర్వ్యూ కమిటీకి పురుషోత్తమ్ అగర్వాల్ నాయకత్వం వహించారు. కమిటీ సభ్యులు నన్ను ఇంటర్వూ చేసే సమయంలో తెలంగాణ అంశంతోపాటు వరకట్న వేధింపులు, త్యాగరాజస్వామి, అన్నమయ్య తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికీ సరైన సమాధానాలు చెప్పడంతో 2013 బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యాను.
ప్రశ్న : కుటుంబ నేపథ్యం.?
జవాబు : భర్త రవితేజ హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. సోదరుడు చార్విక్ ఎంబీఏ చదివి ఉద్యోగం చేస్తున్నారు.