అంతా వారిష్టం | Transfer of Ownership Guidelines | Sakshi
Sakshi News home page

అంతా వారిష్టం

Published Mon, May 25 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

Transfer of Ownership Guidelines

ఏలూరు :ప్రభుత్వ శాఖల్లో బదిలీల వేడి రాజుకుంటోంది. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండగా, మార్గదర్శకాల్లో సర్కార్ మార్పులు చేసింది. దీనివల్ల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా బదిలీల వ్యవహారం నడిపే ప్రమా దం ఉందని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతానికి మించి బదిలీ చేయకూడదన్న పరిమితిని ఎత్తివేయడం, గరిష్ట సర్వీసు ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గింపు, కొన్నిశాఖల్లో బదిలీలకు కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేయడం గుబులు రేపుతోంది. మొత్తం ప్రక్రియను ఇన్‌చార్జి మంత్రి పర్యవేక్షణలో చేపట్టనుండటంతో ప్రజాప్రతినిధుల జోక్యం మరింత తీవ్రమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జీరో సర్వీసు నుంచి మూడేళ్లలోపు ఒకే స్థానంలో పనిచేస్తున్న వారిని ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
 
 ఆ రెండు శాఖల్లో సిఫార్సులకే పెద్దపీట
 మాట వినని అధికారులను బదిలీ చేస్తామని, పదోన్నతుల వ్యవహారం కూడా తమ చేతుల్లోనే ఉందని ఇటీవల జిల్లాకు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేయడం గుబులు రేపుతోంది. ఆర్‌డబ్ల్యుఎస్ ఇన్‌చార్జి ఎస్‌ఈగా కొనసాగుతున్న ఏలూరు ఈఈ సీహెచ్ అమరేశ్వరరావుకు పదోన్నతి కల్పిస్తారా, అదే స్థానంలో కొనసాగిస్తారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. పంచాయతీరాజ్ శాఖలో గ్రామ కార్యదర్శి, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 155 మందిని బదిలీ చే యడానికి అవకాశం ఉందని సమాచారం. డీపీవో కార్యాలయ పరిపాలనాధికారి జి.సంపత్‌కుమారి, ఏలూరు డీఎల్‌పీవో జి.రాజ్యలక్ష్మి ఇక్కడకు వచ్చి మూడేళ్ల కాలం పూర్తికావడంతో వారికి బదిలీ తప్పదని తెలుస్తోంది.
 
 రెవెన్యూలో కౌన్సెలింగ్‌కు అవకాశం?
 జిల్లా రెవెన్యూ శాఖలో వీఆర్వో మొదలుకుని ఆర్‌ఐ, డెప్యూటీ తహసిల్దార్, తహసిల్దార్లను కౌన్సెలింగ్ ద్వారా బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు సాగుతున్నాయి. ఈ నెల 29, 30 తేదీల్లో కౌన్సెలింగ్ ద్వారా రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఏదిఏమైనా మార్గదర్శకాల్లో మార్పులతో ఎక్కువ మందిని సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది.
 
 నివేదికలు కోరిన కలెక్టరేట్
 జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు, మూడేళ్లు పూర్తికాని ఉద్యోగుల వివరాలను కేడర్ల వారీగా నివేదించాలని కలెక్టరేట్ వర్గాలు విభాగాధిపతులను కోరాయి. సోమవారం నాటికి హార్డ్, సాఫ్ట్ కాపీలను ఈ మెయిల్ ద్వారా పంపించాలని పేర్కొన్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులు ఆదివారం సెలవు రోజైనప్పటికీ కలెక్టరేట్ నుంచి అడిగిన సమాచారాన్ని క్రోడీకరించేందుకు కుస్తీ పట్టారు.
 
 రోజుకో జీవోతో అయోమయం
 బదిలీలపై నిషేధం ఎత్తివేసిన రోజు నుంచి ప్రభుత్వం రోజుకో జీవో విడుదల చేయడంతో ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. ఇంకా సరైన విధి విధానాలు రాకపోవడం వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకా మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. గతంలోనే మాదిరిగా కేడర్ స్ట్రెంగ్త్‌లో 20 శాతం వరకు మాత్రమే బదిలీలు చేపడితే పరిపాలన వ్యవహారాలకు ఇబ్బంది ఉండదు. ఇష్టారాజ్యంగా ఎవరికి కావాల్సిన ఉద్యోగిని వారు తీసుకునే అవకాశం కొత్త విధానంలో కనిపిస్తోంది. దీనివల్ల కార్యాలయాల్లో పని విధానం దెబ్బతింటుంది. అవసరం మేరకు బదిలీలు చేపట్టాలి. అదికూడా పారదర్శకంగా జరగాలి.
  - చోడగిరి శ్రీనివాస్, అధ్యక్షులు, జిల్లా ఇరిగేషన్ ఎంప్లాయాస్ అసోసియేషన్
 
 తీరుతెన్నూ లేదు
 ఈ నెలలో బదిలీల పక్రియపై విడుదల చేసిన షెడ్యూల్ తీరుతెన్నూ లేదు. బదిలీలకు సంబంధించి జీవోలో సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం ఈ నెలాఖరులో బదిలీలు చేయడం సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్, ఆయా శాఖాధిపతులు చర్చించి బదిలీలు చేయాల్సి ఉన్నదృష్ట్యా ఈ వ్యవహారంలో జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. గత ఏడాది నవంబర్‌లోనే వివిధ శాఖల్లో బదిలీలు జరిగాయి. ఈ దృష్ట్యా అవసరం మేరకే బదిలీలు చేయడం ఉత్తమం. అది కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పారదర్శకంగా చేయాలి.
 - ఆర్‌ఎస్ హరనాధ్, అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement