సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఇన్‌చార్జి ఎండీగా బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉందని రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టీ కృష్ణబాబు తెలిపారు. ఆయన గురువారం విజయవాడలోని ఆర్టీసీ భవన్‌లో ఎండీగా బాధ్యతలు స్వీకరిచారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఎండీ కృష్ణబాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని మంచి సంస్థగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. వచ్చే జనవరి ఒకటిని లక్ష్యంగా పెట్టుకుని విలీనంపై ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు.
ఆర్టీసీ సంస్థ అలాగే ఉంటుందని సిబ్బంది మాత్రమే రవాణాశాఖ పరిధిలోకి వస్తారని తెలిపారు. సిబ్బంది వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తే ఆర్టీసీని కాపాడుకోవచ్చన్నారు. డీజిల్ ధర రూపాయి పెరిగితే ఏడాదికి రూ. 30 కోట్ల నష్టం వస్తోందని వెల్లడించారు. దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అంచనాతో సుమారు 1800 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని తెలిపారు. డీజిల్ బస్‌ల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు రాయితీతో కూడిన ఎలక్ట్రికల్ బస్సులను అందిస్తోందని తెలిపారు.
ఒకొక్క బస్ మీద రూ.55 లక్షలు సబ్సిడీని కేంద్రం ఇస్తోందన్నారు. ఇందులో భాగంగా 6,350 ఎలక్ట్రికల్ బస్సులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలకు తావులేకుండా ఈ-టెండర్ విధానంలో టెండర్లు స్వీకరిస్తుమన్నారు. లీజ్‌కు తీసుకోవడంలో ఎవరు ముందుకు రాకపోతే అప్పుడు ఏం చేయాలో ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు. విజయవాడ, వైజాగ్, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రికల్ బస్‌లను నడిపేందుకు కేంద్రం ఆసక్తి చూపుతోందన్నారు. ప్రతి ఏడాది సుమారు 1000 ఎలక్ట్రికల్ బస్‌లను తీసుకోవాలని ఆర్టీసీ భావిస్తోందన్నారు. ప్రస్తుతానికి 650 బస్సులకు టెండర్లు పిలిచామని కృష్ణబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment