పుష్కర యాత్రికులూ బహుపరాక్
- కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
- నేడు, రేపు రద్దీ కొనసాగే అవకాశం
- తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సౌఖ్యం
సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కర స్నానం చేయడానికి లక్షలాది మంది యాత్రికులు ఉభయగోదావరి జిల్లాలకు తరలివెళుతున్నారు. పుష్కరాల ఆరో రోజు ఆదివారం కూడా రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే జాతీయ రహదారిపై వ్యాన్లు, కార్లు బారులుతీరాయి. ప్రజలంతా పుష్కర స్నానాలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సోమ, మంగళవారాలు సెలవు ప్రకటించింది. దీంతో ఈ రెండు రోజుల్లోనూ రద్దీ ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పుష్కర యాత్రకు బయలుదేరేవారు వీలైనంత మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాస లేని ప్రయాణాన్ని చేయవచ్చు.
బయలుదేరే ముందు..
- పుష్కర స్నానాలకు రద్దీ ఎక్కువగా ఉంటున్నందున జనం పలుచగా ఉండే ఘాట్లను ఎంపిక చేసుకోవాలి.
- గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతున్నం దున తినుబండారాలు, మంచినీటి సీసాలను తప్పకుండా వెంట తీసుకెళ్లాలి.
- అనారోగ్యం సంభవిస్తే వైద్యుడి కోసం ఎదురుచూడకుండా ప్రథమ చికిత్స సామగ్రి, మందులు దగ్గర ఉంచుకోవాలి.
- మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఇన్సులిన్, టాబ్లెట్లు తీసుకెళ్లడం మరవవద్దు.
- ప్రయాణం ఎక్కువసేపు జరుగుతున్న నేపథ్యంలో అదనపు బ్యాటరీలు, బ్యాటరీ సెల్ చార్జర్‌లు తీసుకెళ్లండి.
- సాధ్యమైనంత తక్కువ లగేజీతో వెళ్లండి. మీ వద్ద ఉన్న సొమ్మునంతా ఒక్కరి వద్దే కుటుంబ సభ్యులందరివద్దా ఉంచుకోండి.
- మీ పేరు, ఫోన్ నంబరు, చిరునామా రాసిన స్లిప్‌ను మీ పిల్లల జేబులో ఉంచండి.
- గ్రూపులుగా వెళ్లేవారికోసం..
- రెండు, మూడు కుటుంబాలు లేదా గ్రూపులుగా వెళ్లే వారు ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒకే మాటపై వెళితే మంచిది.
- మీరు ప్రయాణించిన వాహనం నంబరు రాసుకోవడంతోపాటు ఎక్కడ పార్కింగ్ చేస్తున్నారో గ్రూపులో ప్రతిఒక్కరు తెలుసుకోండి. డ్రైవర్ ఫోన్ నంబరు కూడా రాసుకోండి.
- రూట్‌పై మీకు కాని, డ్రైవర్‌కి కాని అవగాహన లేకుంటే దారిలో స్థానికులను అడిగి కనుక్కోండి.
- వృద్ధులు, వికలాంగులు ఉంటే వారికి మిగిలిన వారు పూర్తి సహాయ సహకారాలు అందించాలి.
స్నాన ఘట్టాల వద్ద
- స్నాన ఘట్టాల వద్ద అపరిచితులకు మీ సామగ్రి అప్పజెప్పవద్దు.
- ఒకరి తరువాత ఒకరు స్నానాలకు వె ళుతూ మీ సామగ్రిని మీరే భద్రపరుచుకుంటే మంచిది.
- నీటిలోకి దిగినప్పుడు మీ శరీరంమీద ఉన్న బంగారు ఆభరణాలను గమనిస్తుండండి.
- జనసమ్మర్థం తక్కువగా ఉన్న ఘాట్లలోనే స్నానం చేయడం శ్రేయస్కరం. నదీప్రవాహం లోపల వరకు వెళ్లకూడదు. రక్షణలేని రేవుల్లోకి వెళ్లడం మంచిది కాదు.