నేడే ‘మహా’ ముగింపు
వెల్లువలా తరలివస్తున్న భక్తజనం
♦ ఆఖరి రోజు అధికారులు అప్రమత్తం
♦ అంత్యపుష్కరాల వరకూ మంచి రోజులేడ
భద్రాచలం నుంచి సాక్షి బృందం : పన్నెండు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన గోదావరి పుష్కరోత్సవం శనివారంతో ముగియనుంది. పుష్కరోత్సవంలో గోదావరి నదిలో స్నానమాచరిస్తే ఎంతో పుణ్యం సిద్ధిస్తుందనే అపార నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఆఖరి రోజు వేడుకల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. 14న భద్రాచలంలో త్రిదండి చినజీయర్ స్వామివారు గోదావరి పుష్కరాలను ప్రారంభించారు. 11 రోజులుగా పుష్కర స్నానం కోసం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. జిల్లాలోని ఎనిమిది పుష్కర ఘాట్‌ల ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి.
జిల్లాలో గోదావరి నది ప్రవేశించే వాజేడు మండలం లొట్టపిట్టగండి (టేకులగూడెం) మొదలుకొని భద్రాచలంకు దిగువన జిల్లా సరిహద్దుగా ఉన్న పురుషోత్తపట్నం వరకు గోదావరి తీరంలో ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. గోదావరి పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. జిల్లాలోని రామచంద్రాపురం, పర్ణశాల, భద్రాచలం, మోతె, చినరారుుగూడెం, కొండాయిగూడెం ఘాట్ల వద్ద భక్తుల సందడి నెలకొంది. ఇప్పటికే స్నానమాచరించిన వారు పుష్కరోత్సవం ముగింపు రోజున గోదావరిలో స్నానమాచరించాలని, ఇప్పటి వరకూ స్నానమాచరించనివారు ఆఖరి రోజున ఎలాగైనా పుణ్యస్నానం చేయాలనే ఆసక్తితో పుష్కర ఘాట్లకు తరలివస్తున్నారు.
అంతటా అప్రమత్తం
పుష్కరోత్సవం ముగింపు రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పదకొండు రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు పుష్కర స్నానం చేశారు. ఆఖరి రోజున కూడా భక్తులు సౌకర్యవంతంగా స్నానమాచరించి ఇళ్లకు వెళ్లేలా అధికారులు తగిన శ్రద్ధ తీసుకుంటున్నారు. జిల్లాలో పుష్కరాలను విజయవంతంగా ముగించాలనే తపనతో అధికార యంత్రాంగం మిగిలిన ఒక్కరోజుపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఏడాదంతా శుభమే..
మహా మహిమాన్వితంతో కూడిన గోదావరి పుష్కరాలు ఈ ఏడాదంతా ఉంటాయని భద్రాచలం దేవస్థానం స్థానాచార్యులు స్థలశాయి తెలిపారు. గురువు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. గోదావరి నదికి ఏడాది చివరలో అంత్యపుష్కరాలు నిర్వహిస్తారు. భక్తులు ఈ ఏడాదంతా పుష్కర స్నానం చేయవచ్చని వేద పండితులు చెబుతున్నారు. కృష్ణానదికి పుష్కరాలు వచ్చేంత వరకూ గోదావరిలో పుణ్య స్నానాలు చేయవచ్చని వారు చెబుతున్నారు. అంత్యపుష్కరాల వరకూ అంతా మంచిరోజులేనని దేవస్థానం వేద పండితులు ప్రసాద అవధాని అన్నారు.