నా చేతుల్లోనే చనిపోయింది..
రాజమండ్రి: మహా విషాదం.. పుణ్యస్నానం కోసం వచ్చి పరలోకాలకు వెళ్లారు.. ప్రభుత్వ హత్యలు.. అంటూ గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న విషాద ఘటనపై పలువురు రాజకీయ నేతలు స్పదించారు. క్షత్రస్థాయిలో ఇంతకు వెయ్యిరెట్లు ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. ప్రభుత్వాన్ని ఏలుతున్నాడా? కళ్లు మూసుకుని కూర్చున్నాడా? అంటూ భక్తులు సూటిగా ప్రశ్నించారు.
'నా భార్య సొమ్మసిల్లి పడిపోయింది. అయ్యా.. అంబులెన్స్ ఒక్కసారి ఆపండి.. అయ్యా నా భార్యను ఆస్పత్నికి తీసుకెళ్లండని ఎంత అరిచినా ఎవరూ పట్టించుకోలేదు. కొద్ది సేపటికి నా చేతుల్లోనే నా భార్య చనిపోయింది' అంటూ జీవిత భాగస్వామిని కోల్పోయిన ఓ వ్యక్తి కన్నీరు మున్నీరుగా విలపించడం పలువురిని కటతడి పెట్టించింది. గోదావరి పుష్కరాల మొదటి రోజైన మంగళవారం నాడు రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద చోటుచేసుకున్న విషాదంలో ఇలాంటి రోదనలు.. వేదనలు ఇంకా ఎన్నో. అన్ని వేళ్లూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నవే.
'1800 కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాట్లు చేశామన్నారు. అది పచ్చి అబద్ధం. గోదారి తీరంలో గుక్కెడు మంచినీళ్లు అందించే దిక్కుకూడా లేదు. మరి డబ్బులన్నీ ఏమైనట్లు?' అంటూ ఓ యువకుడు స్పందించాడు. మరో పెద్దాయనైతే.. 'కోట్లు ఖర్చుపెట్టి ఎదవ అనౌన్సుమెంట్లు చేయిస్తారు తప్ప జనం చచ్చిపోతున్నా పట్టించుకోరా, ఆ అనౌన్సుమెంట్లు రెండు నిమిషాలు ఆపి జనం గురించి చెప్పలేరా?' అని ఆగ్రహించారు. తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ఓ మహిళ.. 'చంద్రబాబు గొప్పంటారు.. ఎంటి ఆయన గొప్ప? జనం చనిపోతుంటే ఏం చేస్తున్నాడు? ప్రభుత్వాన్ని ఏలుతున్నాడా? కళ్లు మూసుకున్నాడా?' అంటూ మండిపడింది. ఇవే కాదు.. భక్తులను నెట్టివేస్తూ పోలీసులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం.. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదుల ఏర్పాట్ల లేమి.. నీడ కోసం షెల్టర్ల ఏర్పాట్లు లేకపోవడం, మరుగుదొడ్లలో నీటిచుక్క లేకపోవడం తదితర ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న జనం.. ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారు.