తరతరాలుగా వెట్టిచాకిరే..
- గిరిజనులను కదిలిస్తే కన్నీళ్లే
- రూ.3 వేలు అప్పు చేసినందుకు ఏళ్లతరబడి శ్రమ చేస్తున్న వైనం
- పట్టించుకోని రెవెన్యూ, కార్మికశాఖ
గూడూరు: నేటి ఆధునిక యుగంలోనూ జిల్లాలోని గిరిజనులు వెట్టిచాకిరీలో మగ్గుతున్నారు. తరతరాలుగా భూస్వాముల చెప్పుచేతల్లో వేలాది మంది గిరిజనులు నలిగిపోతున్నారు.వారిని రక్షించాల్సిన ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులెవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. ప్రధానంగా కార్మిక , రెవెన్యూశాఖలు వెట్టిచాకిరీకి గురవుతున్న గిరిజనులను కాపాడే విషయంలో ఘోరంగా వైఫల్యం చెందాయనే విమర్శలొస్తున్నాయి. కార్మికశాఖాధికారులకు గిరిజనుల వెట్టిచాకిరీ వ్యవహారం తెలిసినా పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.
తొమ్మిది మందికి విముక్తి...
ఈ క్రమంలోనే చిల్లకూరు మండలం నర్రావారిపాళెంలో శనివారం ఏఆర్డీ సంస్థ డైరక్టర్ బషీర్ ఫిర్యాదు మేరకు వెట్టిచాకిరీ నుంచి విడుదలైన 9 మంది గిరిజనులు చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీరు తెప్పించక మానదు. నర్రవారిపాళెంలోని కాల్తీరెడ్డి సుబ్రహ్మణ్యం అనే భూస్వామి వద్ద రెండు తరాలుగా వెట్టిచాకిరీ చేస్తున్నామని బాధితులు తెలిపారు. దీనికి కారణం ఎన్నో ఏళ్ళ కిందట తాము తీసుకున్న రూ. 3వేలు అప్పు.. రెండు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా అక్కడే పనిచేస్తున్నా జీతాలు ఇవ్వకపోవగా ఆ ఆప్పు నేటికి రూ. 50వేలు అయినట్లు చెబుతున్నాడు.
వారసత్వ అప్పుల్లో కూరుకుపోయిన వైనం...
గిరిజనుల పేదరికం, నిరక్షరాస్యతే వెట్టిచాకిరీకి కారణమని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1,272 హ్యామ్లెట్స్‌లో 65 వేల కుటుంబాల్లో సుమారు 2.85 లక్షల మంది గిరిజనులున్నారు. వీరి ప్రధాన వృత్తి చేపల పట్టడం. చెరువుల్లో, గుంతల్లో చేపలు పట్టుకునే హక్కును ఆయా ప్రాంతాల్లోని పంచాయతీలు, సొసైటీలు హస్తగతం చేసుకుంటుండడంతో వీరికి జీవనోపాధి ఉండటం లేదు. పేదరికంలో మగ్గుతున్న గిరిజనుల్లో ఎక్కువశాతం మంది భూస్వాముల రొయ్యల గుంతలు, ఇటుకబట్టీల వద్ద ఏళ్ల తరబడి తరతరాలుగా కుటుంబాలతో కలిసి వెట్టిచాకిరీకి గురవుతున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్న భూస్వాములు వారికి కొద్ది మొత్తాల్లో అప్పులు ఇచ్చి వాటిని బూచిగా చూపుతూ ఎక్కడికీ కదలనివ్వకుండా వారసత్వంగా అప్పులను వారి పై రుద్దుతున్నారు. దీంతో గిరిజనులు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది.
పారిపోతే చిత్రహింసలే...
ఎవరైనా ధైర్యం చేసి ఇతర ప్రాంతాలకు పారిపోతే వారిని వెతికి పట్టుకుని భూస్వాములు చిత్రహింసలకు గురిజేస్తారు. వారి కుటుంబసభ్యుల మధ్యనే శిక్షలు విధిస్తున్నారు. భూస్వాములు వారి వద్ద వెట్టిచాకిరీ చేసే గిరిజన కుటుంబాల్లోని మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
లైంగిక వేధింపులపై డీఎస్పీ విచారణ
భూస్వామి గూడూరు ప్రాంతంలోని తాను నివాసముంటున్న ఇంట్లో వెట్టిచాకిరి చేయిస్తూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంపై ఆదివారం డీఎస్పీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. భూస్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అత్యాచారం కేసు, చైల్డ్ లేబర్ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నామని డీఎస్పీ చెప్పారు. నిందితుడు సుబ్రహ్మణ్యం ప్రస్తుతం పరారీలో ఉన్నందున గాలింపు చేపట్టామని తెలిపారు.