గిరిజనాభివృద్ధికి కృషి
Published Fri, Sep 20 2013 12:47 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
గిరిజనుల జీవన విధానాలు మరింత మెరుగుపరచేందుకు, వారి ఆర్థికాభివృద్ధికి వివిధ శాఖల నిధులతో ప్రత్యేక కార్యక్రమాలను విస్తరింపజేస్తామని కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. రంపచోడవరం ఏజెన్సీ డివిజన్‌లోని గంగవరం, రంపచోడవరం మండలాలల్లో గురువారం ఐటీడీఏ, వివిధ శాఖల అధికారులతో కలసి కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా గంగవరం ఆశ్రమ పాఠశాలలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి, ఐటీడీఏ, ఐకేపీ, పశుసంవర్ధకశాఖ, వ్యవసాయశాఖల సమన్వయంతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి గిరిజనుల ఆదాయాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రంపచోడవరం, వై. రామవరం మండలాల్లో భారీ మంచినీటి పథకాల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు ఆమె తెలియజేశారు.
ఈ ఏడాది ఏజెన్సీలోని ఏడు మండలాల్లో సుమారు మూడువేల డ్వాక్రా సంఘాలకు రూ. 27కోట్ల మేర బ్యాంక్ లింకేజి రుణాలు అందజేయనున్నామన్నారు. గిరిజనుల గృహ నిర్మాణ వ్యయం రూ. ఒక లక్షా ఐదువేలకు పెంచినట్టు కలెక్టర్ తెలియజేశారు. ఏజెన్సీలో వయోజన విద్యా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసే బాధ్యతను కలెక్టర్ రంపచోడవరం ఐటీడీఏ పీఓ, సబ్‌కలెక్టర్లపై ఉంచారు. తొలుత పిడతమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది వివరాలపై వైద్యాధికారిణి ఇందుశ్రీని ఆరా తీశారు. అనంతరం గొరగొమ్మి గ్రామాన్ని సందర్శించి డ్వాక్రా మహిళలతో సమావేశైమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఐకేపీ ఉద్యానవన, ఉపాధి పధకం, ఆరోగ్య కార్యక్రమాల అమలుపై అధికారులతో ఆమె సమీక్షించారు. లక్కొండ, గంగవరం గ్రామాలలో ఉపాధి హామీ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ పర్యటనలో ఐటీడీఏ పీఓ సి.నాగరాణి, రంపచోడవరం సబ్ కలెక్టర్ గంధం చంద్రుడు, గిరిజన సంక్షేమశాఖ ఈఈ నాగేశ్వరరావు, ఐకేపీ ఏపీడీ జిలానీ, ఉపాధి ఏపీడీలు తాతారావు, ఉమామహేశ్వరరావు, ఏడీఎంఅండ్‌హెచ్‌ఓ రాజు, సహాయ గిరిజన సంక్షేమాధికారి సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొండి
రంపచోడవరం : గిరిజనులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ పిలుపునిచ్చారు. కలెక్టర్ గురువారం సాయంత్రం రంపచోడవరం మండలం తాటివాడలో తాటిపీచు తీసే యంత్రాలను గిరిజనులకు అందజేశారు. సీటీఆర్ ఐ డెరైక్టర్ టీజీకే మూర్తి మాట్లాడుతూ సీటీఆర్‌ఐ, కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) రాజానగరం సంయుక్తగా తాటి పీచు తీసే యంత్రాలను అభివృద్ధి చేసినట్టు తెలియజేశారు. రెండు మిషన్‌లను ఆత్మ ఆర్థిక సహకారంతో తాటివాడలో గిరిజనులకు అందజేసినట్టు ఆయన వెల్లడిం చారు. ఒక్కో యంత్రం ఖరీదు రూ. 65 వేలు ఉంటుందని ఆయన తెలిపారు. ఐటీడీఏ పీఓ సి. నాగరాణి, సబ్ కలెక్టర్ గంధం చంద్రుడు, పీహెచ్‌ఓ సీహెచ్ శ్రీనివాస్, ఎస్‌ఓ చిన్నబాబు, కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ జీఆర్ నాయుడు, రంపచోడవరం కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఐకేపీ ఏపీటీ జిలానీ
తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement