
తీరం.. త్రివర్ణ శోభితం
విశాఖ తీరం మురిసింది. మువ్వన్నెల్లో మెరిసింది. రాష్ర్ట విభజన అనంతరం నవ్యాంధ్రలో తొలి స్వాతంత్య్ర వేడుకలకు వేదిక కావడంతో రాష్ర్ట ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలు నిర్వహించింది. వివిధ బలగాల మార్‌చపాస్ట్, ప్రభుత్వ శాఖల శకటాలు కనులపండువ చేశాయి.. విద్యార్థుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి...
సాక్షి, విశాఖపట్నం : ఎగసిపడే అలలహోరు.. వానలో తడిసినతీరం..ఎటుచూసినా ఆహ్లాదకరమైన వాతావరణంలో అబ్బురపరిచే విన్యాసాలతో స్వాతంత్య్ర వేడుకలు నగరవాసుల్లో దేశభక్తిని రగిలించాయి. రాష్ర్టస్థాయి స్వాతంత్య్ర వేడుకలు శనివారం తీరంలో కన్నులపండుగగా జరిగాయి. కవాతు..నయనాందకరమైన శకటాలు.. విద్యార్థుల విన్యాసాలు.. సాంస్కృతిక ప్రదర్శనల సంబరాలు అంబరాన్ని తాకాయి. యుద్ధనౌకలు.. నేవీహెలికాప్టర్ల విన్యాసాలు సందర్శకులకు వింత అనుభూతినిచ్చాయి. చినుకులు పడుతున్నా నగర వాసులు తీరానికి పోటెత్తారు. వేడుకలకు గంట ముందు కురిసిన వర్షం ఇబ్బందికి గురి చేసింది. జెండావందనానికి కొద్దిక్షణాల ముందు వరుణుడు శాంతించడంతో వాతావరణం సాధారణ స్థితికి వచ్చేసింది.
తీరంలో మొదలైన సందడి
ఉదయం నుంచే సందడి మొదలైంది. ఏడున్నరగంటల నుంచి జనంతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర వీఐపీల రాక మొదలైంది. తొలుత వేదిక వద్దకు డీజీపీ జే.వీ.రాముడు,తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేరుకున్నారు. 9గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జెండా వందనం చేశారు. వందేమాతర గీతం ఆలపిస్తుండగా మొదటి బెటాలియన్ కంటిం జెంట్ కమాండెంట్ జే.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆర్మడ్ దళం గార్డ్ ఆఫ్ హానర్‌ఇచ్చారు.
స్ఫూర్తిని నింపిన కవాతు..
ఎఎస్‌పీ సిద్ధార్థ కౌషల్ నేతృత్వంలో కవాతు ఆకట్టుకుంది. పోలీస్‌బ్యాండ్‌తో పాటు తొలిసారిగా నేవీబ్యాండ్ కవాతులో పాల్గొంది. తొమ్మిది ఆర్మడ్, మరో తొమ్మిది అన్‌ఆర్మడ్ కంటింజెంట్స్ కవాతులో పాల్గొనగా,సిటీఆర్మడ్ రిజర్వుదళంతొలిసారి కదం తొక్కింది. సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన సందర్శకులను కట్టిపడేశాయి. 21 శకటాలను ప్రదర్శించారు. అనంతరం పోలీస్, అగ్నిమాపక, అటవీ శాఖల్లో సేవలందించిన 65 మందికి వివిధరకాల మెడల్స్‌ను సీఎం బహూకరించారు. విశాఖకు చెందిన ప్రముఖస్వాతంత్ర సమరయోదుడు కందాల సుబ్రహ్మణ్య తిలక్‌ను సీఎం సత్కరించారు.
► సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాటవాన్ని ముఖ్య అతిథులు చదువుతుంటారు. కానీ సీఎం ప్రసంగపాటవానికి సంబంధం లేకుండా తనదైన శైలిలో చెప్పిందే చెబుతూ గంటా ఐదు నిముషాల పాటు ఏకబికిన ప్రసంగించారు.
► ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు పిరమిడ్ విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశాయి. విశాఖకు చెందిన స్నేహశీల నాట్యవిన్యాసాలు చేస్తూనే తన పాదముద్రికలతో భారత్‌మ్యాప్‌తో పాటు అంతర్బా గంగా చరఖాను చిత్రీకరించడం సందర్శకులను అబ్బురపరిచింది.
► థింసానృత్యం, సవేరా నృత్యాలతో గిరిజనులు ఆకట్టుకున్నారు. అంబిక ప్రదర్శించిన రింగ్‌డాన్స్ కనురెప్పలను వాల్చనీయలేదు. -పశ్చిమగోదావరి జిల్లా దేవరాపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన తాడాట విన్యాసాలు అలరించాయి.
-గిరిగోరుముద్దలు, ఈ ఆరోగ్యం, మాతా శిశు ట్రాకింగ్ సిస్టమ్ స్కీమ్స్‌కు శ్రీకారం చుట్టారు.
-కార్యక్రమాలనంతరం సీఎం విశ్వప్రియ ఫంక్షన్‌హాలులో హై-టీ అనంతరం ప్రత్యేక విమానంలో పట్టిసీమ బయల్దేరి వెళ్లారు.