
అనంతపురంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో (పోలీసు శిక్షణ కళాశాల మైదానం) జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్పీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాగా అంతకు ముందు టవర్ క్లాక్ వద్ద గాంధీజీ విగ్రహానికి ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు.
కాగా స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా అనంతపురంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు చూసేందుకు సామాన్యులకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రస్థాయి వేడుకలు.. ఊళ్లోనే జరుగుతున్నాయి..మళ్లీ జరుగుతాయో లేదో ఒక్కసారైనా ఆ వేడుక ప్రత్యక్షంగా చూడాలనుకున్న వారందరి ఆశలపై అధికారులు నీళ్లు పోశారు. వేడుకలను తిలకించేందుకు సాధారణ ప్రజలకు రెండు వేల కార్డులు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నా, వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రజల కోసం కేటాయించిన బీ–3 పాసులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చెంతకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో నాయకులంతా తమ అనుచరులకు, బంధువులకు పంచి పెట్టారు. దీంతో రాష్ట్రస్థాయి వేడుక కూడా అధికార పార్టీ కార్యక్రమంగా మారిపోయింది.