రాష్ట్రపతి పాలన పెట్టండి.. గవర్నర్‌కు టీఆర్‌ఎస్ వినతిపత్రం
సీఎం ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమస్యలకు కారణమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్ నరసింహన్‌ను టీఆర్‌ఎస్ కోరింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఎంపీలు మందా జగన్నాథం, జి.వివేక్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కె.హరీశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, కె.తారక రామారావు, సోమారపు సత్యనారాయణ, ఎం.బిక్షపతి, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సీఎంపై కేబినెట్ మంత్రులకు విశ్వాసం లేదని తెలిపారు. డిప్యూటీ సీఎం తెలంగాణకు చెందిన కేబినెట్ మంత్రులంతా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారని వివరించారు. సీఎం రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించకపోగా మరింతగా దిగజారే పరిస్థితులను కల్పిస్తున్నాడని గవర్నరుకు వారు ఫిర్యాదు చేశారు.
శాంతిభద్రతలు క్షీణించడానికి సీఎం ఒక ప్రాంతానికి అనుకూలంగా పనిచేస్తూ ఏపీఎన్‌జీవోల సమ్మెను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సర్వీసుకు సంబంధంలేని అంశాలపై ఏపీఎన్‌జీవోలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం లేదని గవర్నర్‌కు వివరించారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా నివేదికలను, ప్రకటనలను ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి తెచ్చినట్లు మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి చేసిన ప్రకటనను గవర్నరుకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సలిజం పెరుగుతుందంటూ నివేదికలను ఇవ్వాలని దినేశ్‌రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు సీఎం ఆదేశించడం.. భూకబ్జాలకు, అవినీతికి, అక్రమాలకు మద్దతును ఇవ్వాలని కోరడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసేవిధంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరెంటు సంక్షోభం తీవ్రమైనా ప్రభుత్వ పరంగా చర్యలేమీ తీసుకోకుండా గ్రిడ్‌లను దెబ్బతీసే విధంగా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి సంక్షోభానికి కారణమైన ముఖ్యమంత్రిని భర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలననను విధించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.