కనగానపల్లి, న్యూస్‌లైన్ : ఆధిపత్యం కోసం ప్రత్యర్థులపై దాడులు చేయడం పరిటాల వర్గీయుల నైజమని వైఎస్‌ఆర్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. రామగిరి సహకార సంఘం ఎన్నికల సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం రామగిరి పోలీస్‌స్టేషన్ ఎదుట కార్యకర్తలతో కలిసి ఆయన ఆందోళన చేశారు. అంతకుముందు దాడి ఘటనపై పోలీసులతో ఆయన మాట్లాడగా.. వారు సరిగా స్పందించలేదు. దీంతో స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గంట పాటు అక్కడే కూర్చున్నారు.
ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల వర్గీయుల దౌర్జన్యాలను ఎండగడుతూ వారికి వ్యతిరేకంగా ఎదుగుతున్నారన్న అక్కసుతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చురుగ్గా పని చేస్తున్నారన్న ఉద్దేశంతో యూత్ నాయకులు ముకుందనాయుడు వంటి వారిపై దాడులు చేయించారన్నారు. ప్రజాభిమానం కోల్పోయిన పరిటాల వర్గీయులు ప్రత్యర్థులపై దాడులకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. పోలీసుల ఎదుట, జనం మధ్య నడిరోడ్డుపై దాడి జరిగినా ఇంతవరకు టీడీపీ నేతలను అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోవాలా అని పోలీసులను ప్రశ్నించారు.
దాడికి పాల్పడిన ఎమ్మెల్యే అనుచరులు కళ్లెదుటే తిరుగుతున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు. తక్షణం వారిపై కేసు నమోదు చేయాలని, అప్పటి వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ చుట్టూ చేరి నినాదాలు చేశారు. ఇంతలో ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతి అక్కడికి చేరుకుని ప్రకాష్‌రెడ్డితో మాట్లాడారు. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం దాడిలో గాయపడిన వారిని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పరామర్శించారు.
ఆధిపత్యం కోసమే దాడులు
Published Sat, Jan 11 2014 2:51 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement