సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమలలో సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం చైర్మన్ విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు... టీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.
దీంతో నెలకు రూ. 6 కోట్ల అదనపు భారం పడుతుంది. భగవంతుని సంపదకు ఎటువంటి పరిస్థితుల్లో నష్టం వాటిల్లకుండా వస్తువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయా సీజన్లలో వస్తువులను కొనుగోలు చేసేలా 6 నెలల టెండర్ల వ్యవధిని 3 నెలలకే తగ్గించారు. తిరుపతిలో నీటి సమస్య నివారణలో భాగంగా బాలాజీ రిజర్వాయర్ నిర్మిస్తారు. సామాన్య, నడక దారి భక్తులకు ఇబ్బంది కలగకుండా 300 రూపాయల ఆన్‌లైన్ టికెట్లు శని, ఆదివారాల్లో తగ్గించారు. వీలైనంతవరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించి పాతపద్ధతిలోనే దర్శనభాగ్యం కల్గించేలా ఆలోచన ఉంది. తిరుపతిలోని హోటళ్లలో ఆన్‌లైన్ టికెట్లు ఇచ్చే విషయాన్ని పరిశీలించనున్నారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులతో పాటు టీటీడీ ఈవో సాంబశివరావు పాల్గొన్నారు.
ధర్మకర్తలమండలి ముఖ్యమైన నిర్ణయాలు:
♦ విశాఖ జిల్లా ఉపమాక, గుంటూరు జిల్లాలోని అనంతవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు టీటీడీలో విలీనం.
♦ వైఎస్‌ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసే ప్రతిపాదన.
♦ పలమనేరులో 450 ఎకరాల్లో గోశాలను నిర్మించి అక్కడ అన్ని రకాల ఆవులను పెంచాలని నిర్ణయం.
♦ తిరుపతిలో విద్యుత్ అవసరాల నిమిత్తం తంబళ్లపల్లిలో 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్, తిరుమలలోని నారాయణగిరిలో 7 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
♦ తిరుమల అడవుల్లో 400 హెక్టార్లలో 1.50 లక్షల ఎర్రచందనం మొక్కలను నాటాలి. వచ్చే ఏడాది నాటికి 12 లక్షల ఎర్రచందనం మొక్కలను పెంచాలని ప్రతిపాదన.
♦ తిరుమలలో నందకం విశ్రాంతి గృహం పక్కన 26 కోట్ల రూపాయలతో వకుళాదేవి విశ్రాంతి గృహం నిర్మించేందుకు ఆమోదం. ఇందులో 220 రూములు ఏర్పాటు చేసి, 1,225 మంది భక్తులకు వసతి కల్పిస్తారు.
♦ స్విమ్స్‌లో రూ. 4.26 కోట్లతో 96 ప్రత్యేక గదులను నిర్మించి డయాలసిస్ విభాగం విస్తరణ.
తానా సభల సందర్భంగా అమెరికాలోని 4 ప్రదేశాల్లో ప్రవాసాంధ్రుల ఖర్చుతో శ్రీనివాస కల్యాణాల నిర్వహణకు ఆమోదం.
సామాన్య భక్తులకే పెద్ద పీట..
Published Wed, Jun 10 2015 3:32 AM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM
Advertisement
Advertisement