ధర్మవరం టౌన్, న్యూస్‌లైన్ : ట్రెజరీ ద్వారా సకాలంలో జీతాలు అందేలా ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మునిసిపల్ ఉద్యోగులు ఆజన్మాంతం రుణపడి ఉండాలని మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమోహన్ అన్నారు. బుధవారం స్థానిక పాత మునిసిపల్ కార్యాలయం వద్ద మునిసిపల్ ఉద్యోగ సంఘం నాయకులతో సమైక్య ఉద్యమ కార్యాచరణ కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ.. నిర్వీర్యమైన మునిసిపల్ వ్యవస్థకు చక్కదిద్ది.. అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైఎస్‌దేనన్నారు. ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా జీతాలు అందించడమే కాకుండా ఫ్రీ ఆడిట్, మెడికల్ రీ యింబర్స్‌మెంట్ అందించి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. మునిసిపల్ శాఖ ఉద్యోగులు సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర వహిస్తున్నారన్నారు. ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
అసమర్థ సీమాంధ్ర ఎంపీల వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందన్నారు. వీరంతా ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారని, విభజన వద్దని కోరడం లేదన్నారు. సమైక్య రాష్ట్ర ప్రకటన వెలువడే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్షులు చిన్న రాజు, ఉపాధ్యక్షులు సాయి ప్రకాష్, నాయకులు వెంకటరామయ్య, శివాజి, నర్సింహులు, రవి, రామాంజినేయులు, సత్యం, పుల్లయ్య తదిత రులు పాల్గొన్నారు.