తెనాలిటౌన్, న్యూస్‌లైన్
ఈ ఏడాది పసుపు పంట సాగు చేసిన రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. అక్టోబరు, సెప్టెంబరు నెలల్లో సంభవించిన తుపానుల దెబ్బకు పసుపు చేలల్లో వారం రోజలపాటు నీరు నిల్వ ఉండి పైరు ఉరకబారి దెబ్బతింది. ఆ తరువాత దుంప, వేరుకుళ్ళు, ఎండు తెగులు వ్యాపించి పంట ముందుగానే ఎండిపోయింది. దీంతో దిగుబడులు కూడా తగ్గుతున్నాయి. సాధారణంగా మార్చి నెలలో రైతులు పసుపు పంటను దున్నుతారు. తెగుళ్లు ఆశించడంతో మొక్కలు ఎండిపోయాయి.
దుంపకు కుళ్ళు రావడంతో చేసేదేమీ లేక రైతులు పంట దున్నే పనిలో పడ్డారు. కొల్లిపర, కొల్లూరు, దుగ్గిరాల మండలాల్లో రైతులు పసుపును దున్నుతుండగా, మరి కొన్ని మండలాల్లో ఆకులను తొలగిస్తున్నారు. కొల్లిపర మండలంలో 3వేలఎకరాలు, కొల్లూరులో 2500, తెనాలి మండలంలో 200, దుగ్గిరాలలో 1250, భట్టిప్రోలులో 1600 , వేమూరులో 100 , అమర్తలూరులో 100 , చుండూరు మండలంలో 200 ఎకరాల్లో పసుపు పంటను రైతులు సాగు చేస్తున్నారు. తుపానులు, భారీ వర్షాల కారణంగా ఈ ఏడాది దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎకరం పొలం కౌలుకు రూ.30 వేలు, విత్తనం నాటడానికి రూ.25వేలు, ఎరువులు, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.50వేలు రైతులు ఖర్చు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పసుపు ధర రూ.5వేలు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే రోజుల్లో రూ.6వేలు పలికింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరలు రైతుకు గిట్టుబాటు కావడం లేదు. ధరలు ఇలాగే కొనసాగితే ఎకరాకు కౌలు రైతులకు రూ.50 వేలు నష్టం వచ్చే పరిస్థితి నెలకొంది. ధరలు ఆశాజనకంగా లేకపోవడం, పంట దిగుబడులు కూడా ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ళ మేరకే రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొల్లిపర మండలం తూములూరు, కొల్లిపర, పిడపర్తిపాలెం గ్రామాల పరిధిలో, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని కొల్లూరు మండలం లంక గ్రామాల్లో పసుపు దున్నుతున్నారు. దున్నిన పొలాల్లో రైతులు మొక్కజొన్న నాటుతున్నారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
ఎకరం పొలం కౌలుకు తీసుకుని పసుపు సాగు చేశా. తుపానులకు పైరు ఉరకబారింది. కేవలం 12 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. మార్కెట్‌లో ధర లేక ఎకరాకు రూ.50వేలు నష్టం వచ్చింది. ప్రభుత్వం పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. క్వింటా ధర రూ.8 వేల వరకు ఉంటే రైతులకు కొంత ఊరట కలిగింది.
- కేశన సాంబశివరావు, కౌలుైరె తు, కొల్లిపర
కళ తప్పిన పసుపు
Published Sat, Feb 1 2014 3:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement