
హర్షవర్ధన్
విజయవాడ: టీవీ యాంకర్ హర్షవర్ధన్ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్సాండెంట్ ఫాదర్ పి.బాలను హర్షవర్ధన్ బ్లాక్ మెయిల్ చేశాడు. 5 కోట్ల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే ఒక ప్రముఖ టీవీ చానెల్‌లో కాలేజీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తానంటూ వారిని బెదిరించాడు.
దాంతో బాల ఎస్పి రఘురామి రెడ్డిని ఆశ్రయించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హర్షవర్ధన్‌కు సహకరించిన నల్లజర్లకు చెందిన ఫాదర్ ల్యూక్‌బాబును తొలుత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యూక్‌బాబు ఇచ్చిన సమాచారంతో హర్షవర్ధన్‌ను విజయవాడలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అతనిని విజయవాడలోనే అరెస్టు చేశారు. హర్షవర్ధన్‌ను ఏలూరు పోలీసులకు అప్పగించనున్నారు.
'క్రైమ్ వాచ్' పేరిట ఓ టీవిలో నిర్వహించే కార్యక్రమం ద్వారా హర్షవర్ధన్ గుర్తింపు పొందాడు. నేరవార్తలు అందిస్తూ నేరస్తుడుగా మారాడు. భీమడోలు మండలం తండ్రగుంటకు చెందిన యండ్రపాటి హర్షవర్ధన్ హైదరాబాద్లో స్థిరపడ్డాడు. జిల్లాతో అనుబంధం కొనసాగిస్తూ ఈ చర్యకు పాల్పడ్డాడు.