విశాఖ బీచ్‌లో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో సముద్ర స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు.
విశాఖపట్నం: విశాఖ బీచ్‌లో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో సముద్ర స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతిచెందగా, మరొకరు గల్లంతయ్యారు. స్థానిక కొబ్బరితోట ప్రాంతానికి చెందిన కాకర మహేష్ (19), కాకర చంద్రమౌళి (18), రాజు (16), సాయి (15), చందు (14), రమేష్ (19), ఆటోడ్రైవర్ పైడిరాజు, మెడికల్ రిప్రజంటేటివ్ అప్పలరాజు (24) ఆదివారం ఆర్కే బీచ్‌కు వెళ్లి స్నానానికి దిగారు.
పెద్ద కెరటం రావడంతో అప్పలరాజు, రమేష్, అన్నదమ్ములు కాకర చంద్రమౌళి, కాకర మహేష్ లోపలికి వె ళ్లిపోయారు. సమీపంలో ఉన్న లైఫ్‌గార్డులు చంద్రమౌళిని, రమేష్‌ను రక్షించారు. కొద్ది నిమిషాలకే అప్పలరాజు మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. గల్లంతైన మహేష్ కోసం గాలిస్తున్నారు.
విశాఖలోని ఆరిలోవ ప్రాంతం గాంధీనగర్‌కు చెందిన ఏడుగురు యువకులు రుషికొండ బీచ్‌లో స్నానాలకు దిగారు. ఒక్కసారిగా ఉవ్వెత్తిన పెద్ద అల రావడంతో కాకి రాజేష్ (20) సముద్రం లోపలకు కొట్టుకుపోయాడు. సుమారు 20 నిమిషాల తర్వాత మత్స్యకారులు చేపల కోసం వేసిన ఓ వలలో రాజేష్ మృతదేహం లభించింది.