
జయవర్దన్, మోక్షిత
కూడేరు: ఆ తల్లిదండ్రుల మనస్పర్థలు ఇద్దరు చిన్నారులను అనాథలను చేశాయి. క్షణికావేశంతో వారు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలిద్దరూ దిక్కులేనివారయ్యారు. అభం శుభం తెలియని ఆ చిన్నారులు.. తల్లిదండ్రుల మృతదేహాలపై పడి ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని కొర్రకోడు డ్యామ్‌కు చెందిన ఈడిగ వాసు(30), నాగతేజ శ్వణి(27) ప్రేమించుకుని 2012లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
వాసు పీఏబీఆర్ డ్యామ్ వద్ద ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఆరేళ్ల కుమారుడు జయవర్ధన్, నాలుగేళ్ల కుమార్తె మోక్షిత ఉన్నారు. శనివారం రాత్రి వాసు, నాగతేజశ్వణిలు భోంచేసి నిద్రించేందుకు వెళ్లారు. వాసు తల్లిదండ్రులు మరో ఇంట్లో నిద్రించారు. ఉదయం ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా.. ఉరేసుకుని కనిపించారు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు.