సాక్షి, అమరావతి: చెత్త కుండీలో అప్పుడే పుట్టిన పసికందు.. హాస్టల్‌లో బాలిక ప్రసవం–కిటికీ నుంచి బిడ్డను విసిరేసిన వైనం వంటి వార్తలు వింటుంటే హృదయం ద్రవించి పోతుంది. మరోవైపు.. ఐవీఎఫ్ సెంటర్లలో శిశు విక్రయాలు.. పిల్లలను కిడ్నాప్ చేసి రూ.లక్షలకు అమ్మేస్తున్న ఘటనలూ చూస్తున్నాం. అవాంఛిత బిడ్డలను వదిలించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే.. సంతానం కలగని తల్లిదండ్రులు ఎందరో పిల్లల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
మారుతున్న జీవన శైలి, అనారోగ్యం, ఆలస్యంగా వివాహాలు చేసుకోవటం, కెరీర్ కోసం పిల్లలను వాయిదా వేయటం వంటి కారణాల వల్ల సంతానలేమి సమస్య బాగా పెరిగిపోయింది. ఫలితంగానే.. ప్రతి పట్టణంలో ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్లు వెలిశాయి. అయితే, వైద్య విధానాల ద్వారానూ సంతానం కలగని తల్లిదండ్రులు దత్తత తీసుకోవచ్చు.
దత్తత ఎంతో మేలు
గతంలో దత్తత నిబంధనలు కఠినతరంగా ఉండేవి. కేంద్రప్రభుత్వం 2022 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చిన నూతన మార్గదర్శకాల ప్రకారం దత్తత పొందటం ఇప్పుడు సులభం. దత్తత తీసుకోదలిచిన తల్లిదండ్రులు చట్టబద్ధంగా మాత్రమే ఆ పని చేయాల్సి ఉంటుంది. మరే ఇతర పద్ధతుల్లో పిల్లలను దత్తత తీసుకుంటే చట్టరీత్యా నేరం. అలాంటి వారు శిక్షార్హులు అవుతారు. గతంలో పిల్లలు కలగని దంపతులు మాత్రమే దత్తత తీసుకునేందుకు అర్హులు. తాజాగా ఈ నిబంధనను తొలగించి.. పిల్లలు ఉన్నప్పటికీ ఆర్థిక స్థోమత కలిగిన వారు దత్తత తీసుకునే అవకాశం ఇచ్చారు. పిల్లలు కావాలనుకున్న వారు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీకి దరఖాస్తు చేసుకుంటే.. వారు వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లోని శిశుగృహాల్లో దత్తతకు సిద్ధంగా ఉన్న పిల్లల వివరాలు తెలియజేస్తారు. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటైన స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు దత్తత ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు తోడ్పడతాయి.
దేశవ్యాప్తంగా ఉన్న శిశు గృహాల్లో అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఆరేళ్ల పిల్లల వరకు 2,188 మంది దత్తతకు సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్రంలోని శిశు గృహాల్లో సుమారు 120 మంది బాల బాలికలు ఉన్నారు. మరోవైపు దేశ విదేశాలకు చెందిన 31 వేల మందికి పైగా తల్లిదండ్రులు పిల్లలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుని ఉన్నాÆý‡ు. రంగు, భాష, ప్రాంతం తదితర ప్రాధాన్యతల కారణంగా పిల్లలందరినీ దత్తతకు అప్పగించటంలో జాప్యం జరుగుతోంది. దీన్ని నివారించేందుకు సైతం ఏజెన్సీలు కృషి చేస్తున్నాయి. దత్తత కోరే తల్లిదండ్రులకు అవగాహన కల్పించటంతో పాటు వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లోని శిశు గృహాల్లో ఉన్న పిల్లల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తున్నారు.
మరిన్ని వివరాలు కావాలంటే..
దత్తతకు సంబంధించిన మరిన్ని వివరాలు అంగన్వాడీ కేంద్రాలు, ఐసీడీఎస్ అధికారులు, జిల్లా బాలల సంరక్షణాధికారి కార్యాలయంలో లభిస్తాయి. అనాథ శిశువులను సంరక్షించేందుకు సైతం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రోడ్డు పక్కన, కాలువలోనూ చెత్త కుండీల్లోనూ శిశువులను గుర్తిస్తే సమాచారం తెలిపేందుకు టోల్‌ఫ్రీ ఫోన్ నంబర్లు 1098, 181, 100లను ఏర్పాటు చేసింది.
ఎలా దరఖాస్తు చేయాలంటే..
దత్తత తీసుకోదలచిన వారు పాన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, వయసు ధ్రువీకరణ పత్రం, దంపతుల ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం, వివాహ ధ్రువీకరణ పత్రం, ఆరోగ్య ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దత్తత కోసం ఏడు దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
► దత్తత తీసుకోవాలనుకుంటున్న తల్లిదండ్రులు వారి పాన్‌కార్డు ద్వారా ఠీఠీఠీ.ఛ్చిట్చ.nజీఛి. జీn వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.
► సిద్ధం చేసుకున్న ధ్రువీకరణ పత్రాలను వెబ్‌సైట్‌లో వారి లాగిన్ ఐడీ ద్వారా 30 రోజులలోపు అప్‌లోడ్ చేయాలి. దత్తత ఏజెన్సీకి గృహ అధ్యయన నివేదిక సమయంలో రూ.6 వేలు డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది.
► తర్వాత దత్తత ఏజెన్సీ గృహ అధ్యయన నివేదికను తయారు చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తుంది.
► అర్జీదారు కోరుకున్న లక్షణాలున్న పిల్లల వివరాలు రిఫర్ చేస్తూ వారి మొబైల్‌కు సమాచారం అందుతుంది. ఆ సమాచారం ప్రకారం 48 గంటలలోపు వెబ్‌సైట్‌లో లాగిన్ అయి నచ్చిన బిడ్డను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది.
► రిజర్వు చేసుకున్న బిడ్డను 20 రోజులలోపు సరిపోల్చుకుని దత్తత ఏజెన్సీ వద్దకు వెళ్లి బిడ్డ నచ్చిందని ఆమోదం తెలియజేసి రూ.40 వేలు డీడీ ద్వారా చెల్లించి బిడ్డను పొందవచ్చు.
► బిడ్డను పొందిన వారం రోజులలోపు సదరు దత్తత ఏజెన్సీ దత్తతకు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలన్నింటినీ స్థానిక కుటుంబ న్యాయస్థానం లేదా జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో సమర్పించి దత్తత ఉత్తర్వుల ప్రతిని పొందాలి.
► దత్తత తీసుకున్న బిడ్డ సంక్షేమం కోసం స్థానిక దత్తత ఏజెన్సీకి చెందిన సోషల్ వర్కర్ రెండు సంవత్సరాల పాటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి గృహ సందర్శన చేసి ఫాలోఅప్ రిపోర్టును ‘కారా’ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఫాలోఅప్ సందర్శనకు వచ్చిన ప్రతిసారి దత్తత ఏజెన్సీకి రూ.2 వేలు డీడీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment