రాజుపాలెం (గుంటూరు) : రైలు ఢీకొని తండ్రీకొడుకులు మృతిచెందగా.. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని అంచులవారిపాలెం గ్రామానికి చెందిన తోట నాగరాజు తన ఇద్దరు కుమారులతో కలిసి బావి వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో రైలు పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టింది. దీంతో నాగరాజు(30)తో పాటు ఆయన కుమారుడు అనిల్(4) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.