ఆనందపురం(భీమిలి): అతివేగం కాటేసింది. రెండు నిండు ప్రాణాలను బలితీసుకొంది. మరో ముగ్గిరిని క్షతగాత్రులను చేసింది. కుటుంబ సభ్యులను విదేశాలకు సాగనంపి దైవదర్శనం చేసుకొని ఆనందంగా ఇంటికి బయటుదేరిన ఆ కుటుంబంపై విధి పగబట్టింది. మార్గమధ్యలో ఇంటి పెద్దలను తీసుకుపోయి కుటుంబ సభ్యులను దిక్కులేని వారిని చేసింది. మృతులు విజయనగరం జిల్లా కణపాక వాసులు. జాతీయ రహదారిపై వెల్లంకి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం కలెక్టరేట్ దరి కణపాక గ్రామానికి చెందిన పతివాడ సత్యనారాయణ విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా, గొట్లాంలో ఉన్న గాయత్రి కళాశాల డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. భార్య కృష్ణవేణి ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండగా కుమారుడు విజయనగరంలో సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కుమార్తె సమీరకు వివాహం కాగా భర్తతో విదేశాల్లో స్థిరపడింది.
సమీరాను అమెరికా పంపించడానికని శుక్రవారం సత్యనారాయణ, భార్య కృష్ణవేణి కారులో విశాఖ వెళ్లి విమానంలో రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం ఉదయం కుమార్తెను అమెరికా వెళ్లే విమానం ఎక్కించారు. పని మీద వెళ్లి హైదరాబాద్‌లోనే ఉన్న సత్యనారాయణ, కృష్ణవేణిల కుమారుడు సందీప్‌తో కలిసి విమానంలో తిరిగి విశాఖ వచ్చేశారు. అప్పటికే నగరంలో ఉన్న సందీప్ భార్య అనూష, ఆమె కుమారుడు సాకేష్ (2)లను తీసుకొని ఐదుగురూ కారులో సింహాచలం చేరుకొని దర్శనం చేసుకొన్నారు.
మధ్యాహ్నం భోజనాలు చేసుకొని విజయనగరం బయలుదేరారు. కారు వెల్లంకి గ్రామ సమీపానికి చేరుకునే సరికి జాతీయ రహదారిపై ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ల లారీని వెనక వైపు నుంచి వేగంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారు ముందు భాగం అంతా లారీ వెనుక భాగంలో ఇరుక్కు పోయింది. దీంతో వాహనాన్ని నడుపుతున్న సత్యనారాయణ (59), ముందు సీట్లో కూర్చున్న అతని కుమారుడు సందీప్(30) ఇరుక్కు పోవడంతో తీవ్రంగా గాయపడి కారులోనే మృతి చెందారు. కారు వెనుక సీట్లో కూర్చున్న కృష్ణవేణి, అనూష, సాకేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడి కారులో చిక్కుకు పోయిన కృష్ణవేణి, అనూష, సాకేష్‌లను 108 వాహనంలో చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగం డిక్కీ రేకు విడిపోయి లారీకి అతుక్కుపోయి ఉండడాన్ని చూస్తే ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెరుచుకోని ఎయిర్ బ్యాగ్‌లు
హ్యూందాయ్ కంపెనీకి చెందిన ఐ – 20 మోడల్ కారు ప్రమాదానికి గురైంది. అందులో ఎయిర్ బ్యాగ్‌లు సౌకర్యం ఉందని మృతుల బంధువులు తెలుపుతున్నారు. కాగా ప్రమాద సమయంలో అవి తెరుచుకొని ఉంటే ప్రాణాలు నిలిచేవని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
నుజ్జునుజ్జయిన కారు
ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం తునాతునకలైంది. ఇంజిన్ భాగాలు విడిపోయి రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. స్టీరింగ్‌తో సహా అన్నీ ఊడి పోయాయి. ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మధురవాడ ట్రాఫిక్ ఏసీపీ వి.కృష్ణవర్మ, సీఐ హిమబిందు, ఆనందపురం సీఐ ఆర్.గోవిందరావు, ఎస్‌ఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వాహనాలను పక్కకు తరలించి ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసే క్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ సోమరాజు చేతికి గాయాలయ్యాయి.
బ్యాగ్‌తో పరారైన యువకుడికి దేహశుద్ధి
ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు సహాయం అందించాల్సి ఉండగా ఓ ప్రబుద్ధుడు కారులో నుంచి బయటకు తుళ్లి పోయిన డబ్బులు, వస్తువులతో ఉన్న బ్యాగ్‌ని పట్టుకొని పారిపోవడాన్ని గమనించిన కొంత మంది స్థానికులు వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడిది మండలంలోని మిందివానిపాలెం గ్రామంగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment