వేగంగా వెళ్తున్న రెండు వ్యాన్‌లు ఢీ కొని ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సబ్బవరం (విశాఖపట్టణం): వేగంగా వెళ్తున్న రెండు వ్యాన్‌లు ఢీ కొని ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున విశాఖ జిల్లా సబ్బవరం మండలం అతకపల్లి గ్రామ సమీపంలోని సున్నంబట్టీల వద్ద జరిగింది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలానికి చెందిన పలువురు గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రికి వ్యాన్‌లో బయలుదేరారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాకే చెందిన పలువురు రాజమండ్రిలో పుష్కరాలకు వెళ్లి తిరిగి వ్యాన్‌లో వస్తున్నారు.
కాగా, ఈ రెండు వ్యాన్‌లు విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు రెడ్డిపేట గ్రామానికి చెందిన సుభద్ర, మరో వృద్ధుడు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని పెట్రోలింగ్ అధికారులు కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.