రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
Published Wed, Aug 21 2013 3:43 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్ : గురజాల నియోజకవర్గంలో మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఒక ఎంసీఏ విద్యార్థి, ఒక ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందారు. వివరాలు ఇవీ... ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నెసముద్రం గ్రామానికి చెందిన కోయ బాలకోటేశ్వరరావు(22) గుంటూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ విద్యార్థి. మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో బంధువుల వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. పిడుగురాళ్ల పట్టణానికి సమీపంలోని బాలాజీసెమ్ సున్నంమిల్లువద్ద లారీని తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం రాళ్లగుట్టపైకి ఎక్కి అదుపుతప్పి పడిపోయింది. పక్కనే వెళుతున్న లారీ చక్రాలు బాలకోటేశ్వరరావు తలపై ఎక్కడంతో తల నుజ్జునుజ్జై అక్కడికక్కడే మరణించాడు. ఎస్‌ఐలు సాంబశివరావు, జిలానీబాషా ఘటన స్థలికి చేరుకొని మృతుని సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
కుటుంబంలో చదువుకున్నది ఒక్కడే
బాలకోటేశ్వరరావు తల్లిదండ్రులు కోయ రంగయ్య, అనసూయ. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు మిర్చి కమీషన్ కొట్టు నిర్వహిస్తుండగా, మూడో కుమారుడు తండ్రితోపాటు వ్యవసాయం చేస్తున్నాడు. రెండోకుమారుడైన బాలకోటేశ్వరరావుకు చిన్నప్పటి నుండి చదువుపై ఆసక్తి ఉండటంతో చదివిస్తున్నారు. కుటుంబంలో చదువుకున్న ఒక్కడు తమను విడిచి వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
ప్రాణం తీసిన అతివేగం
గురజాల : మితిమీరిన వేగం ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతికి కారణమైంది. పట్టణంలోని జిఐసి కాలనీలో నివాసముంటున్న మర్రి చినమరియదాసు కుమారుడు మర్రి అవినాష్(21) మంగళవారం ద్విచక్రవాహనంపై బంధువులను రైల్వే స్టేషన్ వద్ద వదిలాడు. తిరిగి ఇంటికి అతి వేగంగా వస్తుండటంతో శ్రీసత్యనారాయణ ఐనాక్స్ థియేటర్ వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న మట్టి కుప్పపైకి ఎక్కి ఒక్క ఉదుటున గాలిలో పైకి లేచి కిందపడింది. అవినాష్ తలకు బలమైన గాయమవడంతో 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు,బంధువులు శోక సంద్రంలో మునిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement