
పరిటాల శ్రీరామ్ పెళ్లి పనుల్లో అపశ్రుతి
సాక్షి, హైదరాబాద్ : ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పరిటాల శ్రీరామ్ పెళ్లి పనులు నిమిత్తం వెళుతున్న ఓ బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పెళ్లికి సంబంధించిన డెకరేషన్ సామగ్రిని డీసీఎం వ్యాన్‌లో హైదరాబాద్ నుంచి అనంతపురం తరలిస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ శివారులోని పెద్దాయపల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్, క్లీనర్‌తో పాటు ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా పరిటాల శ్రీరామ్ వివాహం వచ్చేనెల (అక్టోబర్) 1వ తేదీన జరగనుంది. అనంతపురం జిల్లాకు చెందిన జ్ఞానవితో గత నెల 10వ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.