మంత్రుల మధ్య ‘బదిలీల’ చిచ్చు | Two ministers quarreled about RDO transfer | Sakshi
Sakshi News home page

మంత్రుల మధ్య ‘బదిలీల’ చిచ్చు

Published Sat, Nov 15 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

మంత్రుల మధ్య ‘బదిలీల’ చిచ్చు

మంత్రుల మధ్య ‘బదిలీల’ చిచ్చు

ఆర్డీవోల బదిలీల విషయంలో మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య రచ్చ
‘అవసరాల’ బదిలీల్లో మంత్రుల మధ్య విభేదాలు
విశాఖ జిల్లాలో ఇద్దరు ఆర్డీవోల బదిలీ.. వాటిని అడ్డుకున్న గంటా వర్గం
కొత్త ఆర్డీవోను విధుల్లోకి తీసుకోవడానికి నిరాకరించిన కలెక్టర్ కార్యాలయం
బదిలీని అడ్డుకున్న సీఎం కార్యాలయ ఉన్నతాధికారిపై అయ్యన్న మండిపాటు
ఆ తరువాత సీఎస్‌కు ఫిర్యాదు
గంటా భూమి వ్యవహారమే.. అడ్డుకోవడానికి కారణమంట్నున్న పార్టీ వర్గాలు

 
సాక్షి, హైదరాబాద్: అవసరాల మేరకు బదిలీలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు మంత్రుల మధ్య చిచ్చుపెట్టింది. ప్రభుత్వ అవసరాలు కాకుండా మంత్రులు తమ అవసరాలుగా మార్చుకుని బదిలీలకు శ్రీకారం చుట్టారు. దీంతో వారి మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు తారస్థాయికి చేరింది. ముఖ్యంగా విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేదాలు ఈ బదీలీల వ్యవహారంతో మరింత రచ్చకు దారితీశాయి. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తీసుకున్న నిర్ణయం మేరకు జరిగిన ఆర్డీవోల బదిలీలను మంత్రి గంటా అడ్డుకున్నారు. ‘చిన్న బాబు’ సూచనల మేరకు సీఎంవో ఉన్నతాధికారి మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనుకూలంగా జిల్లా కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్ల్లు సమాచారం. దీంతో ఓ ఆర్డీవోను విధుల్లో చేర్చుకోవడానికి కలెక్టర్ కార్యాలయం అధికారులు నిరాకరించారు. ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సీఎం కార్యాలయం అధికారిపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
 
 జిల్లాలోని విశాఖపట్నం, అనకాపల్లి ఆర్డీవోల బదిలీలపై జిల్లా టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. నిన్నటివరకు అక్కడ పనిచేస్తున్న ఇద్దరు అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో మరో ఇద్దరిని నియమిస్తూ రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి నిర్ణయం తీసుకుని బుధవారం జీవో జారీ చేశారు. వాటిని జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తదితరులు వ్యతిరేకించారు. ఈ వర్గం నేతలు సీఎం కార్యాలయంపై ఒత్తిడి తీసుకొచ్చి వారి బదిలీలకు అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియమితులైన ఒక ఆర్డీవో బాధ్యతలు స్వీకరించడానికి గురువారం జిల్లా కల్టెకర్‌ను కలిశారు.తమకు ఉత్తర్వులు అందలేదంటూ ఆయన్ని విధుల్లోకి తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. దీంతో అయ్యన్నపాత్రుడు ఆగ్రహానికి గురయ్యారు. సీఎంవో అధికారుల ఆదేశాల మేరకే కొత్త ఆర్డీవోను విధుల్లోకి తీసుకోలేదని అయ్యన్నపాత్రుడికి తెలిసింది. దీంతో అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు శుక్రవారం ఉదయమే సచివాలయం ఎల్ బ్లాకులోని సీఎం కార్యాలయ ఉన్నతాధికారి వద్దకు వెళ్లి, తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. బదిలీలను మీరెలా అడ్డుకుంటారని ఆయనను తప్పుపట్టినట్టు సమాచారం. పార్టీలో ఎంతో సీనియర్ అయిన మంత్రి కేఈ తీసుకున్న నిర్ణయాలను కూడా అమలుచేయరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిపింది. సీఎంవో అధికారుల తీరు బాగోలేదని, మాట్లాడటానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గంటల తరబడి   వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందంటూ విరుచుకుపడ్డారు.
 
 అధికారులు పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని, వారి తప్పులను చూస్తూ ఊరుకోనని, తనకు అధికారం కొత్త కాదంటూ మండిపడ్డారు.ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఉన్న సమయంలో వీరిద్దరూ ఆయన చాంబర్‌కు వెళ్లారు. దీనిపై  ఫిర్యాదు చేశారు.  అధికారులతో మాట్లాడతానని సీఎస్ వారికి చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆర్డీవో ఒక భూమి విషయంలో మంత్రి గంటాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పార్టీవర్గాలే చెబుతున్నాయి. మరో రెండు నెలలైతే ఆ భూమి గంటా పరమవుతుందని, అంతవరకు ఆయన్నే కొనసాగించాలని గంటా  కోరుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement