
ఒకరి కోసం పోయి మరొకరు..!
విజయనగరం జిల్లా భోగాపురం మండలం చాకివాలస గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం చాకివాలస గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పైడమ్మ అనే మహిళ బహిర్భూమికి వెళ్లి చీకటిలో ఉన్న విద్యుత్ వైరుపై కాలు వేయడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందింది. పైడమ్మ ఎంతసేపటికీ ఇంటికీ రాకపోవడంతో ఆమె కుమార్తె, మేనల్లుడు నారాయణరావు గ్రామా శివారులో వెతుకుతుండగా నారాయణరావు కూడా చూసుకోకుండా విద్యుత్ వైరును తొక్కడంతో షాక్ తగిలి మృతి చెందాడు.
ఒకే కుంటుంబంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామం, కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన కుటుంబాలకు ఎంపీపీ బంగార్రాజు, వైఎస్ఆర్ సీపీ నాయకులు రఘుబాబు, సూర్యనారాయణ పరామర్శించారు.