ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు భర్తతో పాటు ద్విచక్రవాహనంపై కోటప్పకొండకు వస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కునేందుకు
నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్: ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు భర్తతో పాటు ద్విచక్రవాహనంపై కోటప్పకొండకు వస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కునేందుకు విఫలయత్నం చేశారు. బాధితురాలు ద్విచక్రవాహనంపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడడంతో గాయపడిన సంఘటన ఆదివారం కోటప్పకొండ ఆర్యవైశ్య సత్రం ఎదుట చోటుచేసుకుంది. రూరల్ సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాలప్రకారం.. కోటప్పకొండ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జాలయ్య తన భార్య రాజ్యలక్ష్మి, కుమారులతో ద్విచక్రవాహనంపై కోటప్పకొండకు బయలుదేరారు. ఆర్యవైశ్య సత్రం వద్దకు రాగానే ఎదురు నుంచి ద్విచక్రవాహనంపై నుంచి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రాజ్యలక్ష్మి మెడలోని గొలుసు లాక్కునేందుకు యత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో ఆమె ద్విచక్రవాహనంపై నుంచి కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. రూరల్ సీఐ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని కోటప్పకొండ పీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.