పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు.
విజయవాడ: పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. పోలవరం నుంచి గ్రావెటీ పద్ధతిలో నీరు ఇచ్చేటప్పుడు వందల కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ద ప్రెస్‌లో ఉండవల్లి మాట్లాడుతూ ఇపిసిలో టెండర్లు పిలిచినప్పుడు రేట్లు పెంచడానికి వీలులేదని, కానీ ప్రభుత్వం రేట్లు పెంచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రూ. 40 వేల కోట్లకు పోలవరం వ్యయాన్ని ఎందుకు పెంచారో అర్ధం కావడం లేదని, భూసేకరణకు చెల్లించే ధరల విషయంలోనూ శాస్త్రీయత లేదని అన్నారు.
పోలవరానికి ఉండవల్లి ఏం చేశాడని మంత్రి ఉమ అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ పోలవరాన్ని ఆరంభిస్తే చంద్రబాబు తానే పూర్తి చేస్తున్నానని ఇది తన కల అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్ ప్రతిపాదించిన విధంగా పోలవరం నిర్మిస్తే అనుకున్న బడ్జెట్ కే పూర్తయ్యేదని, కానీ ప్రభుత్వాలు ఆలస్యం చెయ్యడం వల్ల బడ్జెట్‌ను పెంచేశారని ఆయన విమర్శించారు. పోలవరానికి వరద వచ్చినప్పుడు నీటిని విజయవాడ, వైజాగ్‌కు తరలించేందుకు వైఎస్ హయాంలోనే ప్రణాళికలు సిద్దం చేశారని వివరించారు. గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి తప్పించుకునేందుకే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ అంటున్నారన్నారు.
స్పెషల్ కేటగిరి స్టేటస్ విషయంలో ప్రభుత్వం రాజీపడింది అని వ్యాఖ్యానించారు. 2014 ఆగస్టు 17న ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో రెవెన్యూ లోటును ప్రకటించారని, రూ. 20 వేల కోట్ల లోటు మూడేళ్ల నుంచి కొనసాగుతోందని తెలిపారు. ఓటుకు నోటు కేసు వల్లే ప్రభుత్వం కేంద్రం వద్ద రాజీపడిందని, ఈ కేసు తేలే వరకూ రాష్ట్రం పరిస్థితి ఇలాగే అయోమయంగా ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ. 400 కోట్లు విద్యుత్ బకాయి ఉందని నోటీస్ ఇస్తే మీరే మాకు బకాయి వున్నారంటూ తెలంగాణ ఎదురు అడగడం ఇందుకు నిదర్శనమని ఉండవల్లి అన్నారు.