
ఉండవల్లిలోని ఫైరింగ్ శిక్షణ కేంద్రంలో లక్ష్యానికి గురిపెడుతున్న కానిస్టేబుళ్లు
మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తూ ప్రాణాలను అరచేత పెట్టుకుని అనుక్షణం అప్రమత్తంగా...
⇒ ఉండవల్లిలోని ఫైరింగ్ శిక్షణ కేంద్రంలో తరచూ ప్రమాదాలు
⇒ నిబంధనలకు విరుద్ధంగా ఇనుపరాడ్‌లతో టార్గెట్‌ల తయారీ
⇒ ఆధునిక పరికరాలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం
⇒ బుల్లెట్ దూసుకెళ్లి ఆందోళనకర పరిస్థితిలో ఏఎన్‌ఎస్ కానిస్టేబుల్
సాక్షి, గుంటూరు: మావోయిస్టుల కోసం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తూ ప్రాణాలను అరచేత పెట్టుకుని అనుక్షణం అప్రమత్తంగా ఉండే యాంటీ నక్సల్స్ స్క్వాడ్( ఏఎన్‌ఎస్) కానిస్టేబుళ్లకు చివరకు ఫైరింగ్ శిక్షణ కేంద్రాల్లో కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
అక్కడ మావోయిస్ట్‌లు కాల్పులు జరుపుతారేమోనని అప్రమత్తంగా ఉండే వీరు ఫైరింగ్ శిక్షణ కేంద్రాల్లో కానిస్టేబుళ్లు పేల్చే తూటాలు తగులుతాయేమోనని అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఇంకా ఇక్కడ అధునాతన పరికరాలను వినియోగించడం లేదు. దాంతో భయం తప్పడం లేదు. దీనికి అవసరమైన సుమారు రూ.40 లక్షల నిధులను ప్రభుత్వం లోటు బడ్జెట్ సాకు చూపుతూ మంజూరు చేయడం లేదు.
ఫైరింగ్‌లో శిక్షణ ఇక్కడే...
గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఏఆర్, ఏఎన్‌ఎస్, సివిల్, కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు, ఉన్నతస్థాయి అధికారులు ఫైరింగ్‌లో శిక్షణకు జిల్లాలోని ఉండవల్లి ఫైరింగ్ రేంజ్‌కు వస్తుంటారు. మంగళవారం సీఆర్‌డీఏ రెస్క్యూ టీమ్ నిర్వహించిన స్నాప్ ఫైరింగ్(టార్గెట్‌ను అటూ ఇటూ కదిలించడం) శిక్షణకు వచ్చిన గుంటూరు రూరల్ ఏఎన్‌ఎస్ పార్టీ కానిస్టేబుల్ అర్ల ఆనంద్ శరీరంలోకి ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.
అతడిని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్స నిర్వహించినప్పటికీ పరిస్థితి విషమంగానే ఉందని, 48 గంటలపాటు పరిశీలనలో ఉంచినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. మూడవ టార్గెట్‌లోని వ్యక్తి ఫైర్ చేయగా నిబంధనలకు విరుద్ధంగా ఇనుప రాడ్డును వినియోగించడంతో గుంటలో ఉండి టార్గెట్ చూపుతున్న ఆనంద్‌కు బుల్లెట్ తగిలింది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ ఉన్నతాధికారులు, ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఓ కానిస్టేబుల్, ఓ ట్రైనీ ఎస్‌ఐ, నేవీ సిబ్బంది తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు.
టార్గెట్‌లు చూపే సమయంలోనే ప్రమాదాలు ...
అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా ఫైరింగ్ రేంజ్‌లో ఇంకా పాత విధానాన్నే కొనసాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిక్షణ ఇచ్చేందుకు ఫైరింగ్‌లో నిష్ణాతులు లేకపోవడం కూడా ప్రమాదాలకు దారితీస్తుందని అంటున్నారు. సికింద్రాబాద్, డెహ్రాడూన్‌లో వంటి చోట్ల కఠోర శిక్షణ పూర్తి చేసిన శిక్షకులు ఇక్కడ లేనట్టు తెలుస్తోంది. దీనికితోడు ఫైరింగ్ కోసం టార్గెట్ రూపొందించే విధానం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉంది.
చెక్క కడ్డీలకు బుల్లెట్ దూరే విధంగా ఉండేలా చెక్కలతో అమర్చి గోతంతో కప్పి ఉండేలా ఏర్పాటు చేసిన టార్గెట్‌లను మాత్రమే వినియోగించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా చెక్క కడ్డీల స్థానంలో ఇనుప రాడ్‌లను వినియోగించడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్నాప్ ఫైరింగ్ మిషన్‌ను కొనుగోలు చేయకుండా ఒక బ్యాచ్ ఫైరింగ్ చేసేటపుడు మరో బ్యాచ్ టార్గెట్ పట్టుకుని ఉండడంతో కూడా ప్రమాదాలకు గురవుతున్నారు.