పిల్లలను దత్తత తీసుకుంటున్నారా..అయితే !
► చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదు
► అవగాహన లేమితో అనర్థాలు
చిత్తూరు : పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకుంటూ ఉంటారు. దత్తత తీసుకునేందుకు ప్రభుత్వం విధించిన విధి విధానాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. కొందరు వాటికి కట్టుబడకుండా అక్రమంగా పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. ఇలా చేయడం తప్పు అని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదని పేర్కొంటున్నారు.
అవగాహన లేమితో అనర్థాలు కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేసుకున్న ఒప్పందం కొంతకాలం తరువాత బయటపడుతుండడంతో జన్మనిచ్చిన తల్లులే కాకుండా పెంచుకున్న తల్లులు కూడా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అభం, శుభం తెలియని చిన్నారులు ఏ తల్లి ఒడికీ చేరక శిశు గృహాలకే చేరుకుంటున్నారు.
దత్తత తీసుకోవాలంటే..
పిల్లలు లేని దంపతులకు ఆ లోటు ఉండకూడనే ఉద్దేశంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ దత్తత పక్రియను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక విభాగం కూడా ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో శిశు గృహాలను ఏర్పాటు చేశారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆ లోటును పూడ్చేందుకు, అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చేందుకు ఐసీడీఎస్ పని చేస్తోంది. 15 ఏళ్లలోపు బాలబాలికలను దత్తతకు అర్హులు. దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు వారి అర్హత ఆధారంగా పిల్లలను ఇస్తారు. పిల్లలను దత్తత తీసుకోవాలనే వారు ఆన్లైన్లో దరఖాస్తును పూరించాలి.
భార్యాభర్తల ప్రస్తుత ఫొటో, వారి వయస్సు, ఇంటి చిరునామా, నివాస, ఆధార్ కార్డులు, ఆదాయ (రూ.లక్షకు పైగా ఉండాలి), వేతనం, వివాహ ధ్రువీకరణ పత్రాలతోపాటు పాన్ కార్డు నమోదు చేయాల్సి ఉంటుంది. ఐసీడీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. దత్తత తీసుకునే తల్లిదండ్రులు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించుకుని ఫిట్‌నెస్ సర్టిపికెట్లను అధికారులకు అందజేయాలి.
భవిష్యత్తులో ఇబ్బందులు
అక్రమ పద్ధతిలో దత్తత తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అర్హులు పిల్లలను దత్తత తీసుకోవచ్చు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
– లక్ష్మీ, ఐసీడీఎస్, పీడీ