ఉమ్మడి రాష్ట్రంలో ఖాళీ పోస్టులు 2,54,000
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన పూర్తయిన నేపథ్యంలో లక్షలాది మంది నిరుద్యోగులు సర్కారీ కొలువుల కోసం ఎదురుచూస్తున్నారు. యువతకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆ నేతలే ముఖ్యమంత్రులుగా తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు రెట్టింపయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టాలన్న డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.
రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ కసరత్తులో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. దీని ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 12,46,600 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా.. గత మార్చి నాటి కల్లా 9.92 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తేలింది. అంటే మిగతా 2.54 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క. ఇందులో రాష్ట్ర స్థాయి కేడర్‌లోనే 18 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ నిర్ధారించింది.
ఉద్యోగుల పంపిణీ కోసం కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఈ వివరాల ఆధారంగా ప్రస్తుతమున్న ఉద్యోగులతో పాటు ఖాళీ పోస్టులను కూడా జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకూ పంపిణీ చేస్తుంది. ఇలా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో 60,661 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే జీవోలు జారీ చేసింది. అయితే రాష్ర్ట విభజన నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇందులో రాష్ట్ర స్థాయి, జిల్లా, జోనల్ స్థాయి పోస్టులున్నాయి. దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పడినందున ముందుగా ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
చాలాకాలంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనందున నిరుద్యోగుల వయో పరిమితిని కూడా పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోస్టుల భర్తీని మాత్రమే చేపడుతుంది. తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటయ్యే వరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ బాధ్యతలు తీసుకుంటుంది. ఈ మేరకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఎలాంటి కసరత్తు ప్రారంభించలేదు.