
‘నిరుద్యోగులకు చంద్రబాబు’ మోసాలు కరపత్రం ఆవిష్కరిస్తున్న వైఎస్‌ఆర్ శ్రేణులు
శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ): యువతకు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబుని 2019 ఎన్నికల్లో బంగాళాఖాతంలో యువత కలపడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. హిందువులకి రామాయణం, క్రైస్తవులకు బైబిల్, ముస్లిం లకు ఖురాన్ ఎంత పవిత్రమైనవో రాజకీయ పార్టీలకు ఎన్నికల మ్యానిఫెస్టో అంతే పవిత్రమైనదని.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఆయా పార్టీలపై ఉందన్నారు. అయితే చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మెంటాడ స్వరూప్ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ దీక్ష’ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలిలో మంగళవారం నిర్వహించారు. గాంధీజయంతి సందర్భంగా ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం నిరుద్యోగులకు ఇచ్చిన మోసాలపై కరపత్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ చంద్రబాబు మాటలు నమ్మి రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారన్నారు.
నోటిఫికేషన్లు ఇస్తారని ఆశగా ఎదురుచూస్తు కోచింగ్‌సెంటర్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారే తప్ప ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్నారు. నాలుగున్నరేళ్లుగా గుర్తుకురాని నిరుద్యోగ యువత ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ‘యువనేస్తం’ పేరుతో మరో మోసానికి చంద్రబాబు తెరలేపుతున్నారన్నారు. రాష్ట్రవిభజన సమయానికి రాష్ట్రంలో 1.34 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నివేదికిస్తే ఇప్పటివరకు ఒక్క ఖాళీని భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. అధికార దాహంతో రైతులకు, మహిళలకు, నిరుద్యోగులందరికీ అమలు చేయలేని హామీలిచ్చి అధికారం చేపట్టి తన కొడుక్కి మాత్రమే ఉద్యోగం ఇచ్చేసి దోచుకు తింటున్నారన్నారు. రాష్ట్రంలో మళ్లీ స్వర్ణయుగం రావాలంటే వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యపడుతుందన్నారు. నిరుద్యోగులపై కనికారం, బాధ్యత లేకుండా వారి జీవితాలతో చెటగాటమాడుతున్న బాబును చిత్తుచిత్తుగా యువత ఓడించడం ఖాయమన్నారు.
దీక్షలో యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ (నాని), ధర్మాన రామ్మోనోహర్‌నాయుడు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర, నగర అధ్యక్షుడు కోరాడ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నక్క రామకృష్ణ, పేడాడ అశోక్, నగర ప్రధానకార్యదర్శులు సీపాన రామారావు, చీమల తారక్, అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. పార్టీ నాయకులు ఎం.వి పద్మావతి, ఎన్ని ధనుంజయరావు, శిమ్మ రాజశేఖర్, గొండు కృష్ణమూర్తి, మూకళ్ల తాతబాబు, పొన్నాడ రుషి, కేఎల్ ప్రసాద్, మండవిల్లి రవి, కోణార్క్ శ్రీను, రఘుపాత్రుని చిరంజీవి, టి.కామేశ్వరి, డాక్టర్ శ్రీనివాసపట్నాయక్, ఆర్.ఆర్.మూర్తి, కె.ముకుందరావు, గుడ్ల మల్లేశ్వరరావు, పొట్నూరు బాలకృష్ణ, చల్లా మంజులత, గుమ్మా నగేష్, ఆదిలక్ష్మి, జ్వోతి, శ్యామ్ వైఎస్సార్ అభిమాని ప్రసాద్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన:దాసన్న
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని...మోసాలకు, అన్యాయాలకు, అక్రమాలకు కేరాఫ్‌గా రాష్ట్రాన్ని తయారు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. నిత్యం విదేశాలు తిరగడమే తప్పా ఈ నాలుగున్నరేళ్లల్లో ఒక్క పరిశ్రమను నెలకొల్పిన పరిస్థితి లేదన్నారు. నిరుద్యోగ యువతకు సరైన శిక్షణ ఇచ్చి నైపుణ్యతను పెంచితే తప్పకుండా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఆ దిశగా టీడీపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేయడం లేదన్నారు. చంద్రబాబు మాటలకు.. చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోతుందన్నారు. తెలంగాణలో రోజుకో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తుంటే ఏపీలో మాత్రం ఇస్తామని ప్రకటనలు గుప్పించడమే తప్పా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదన్నారు.
దోచుకు తినడమే బాబుకు తెలుసు:తమ్మినేని
వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ చంద్రబాబుకి రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదన్నారు. న్యాయస్థానాలపై గౌరవం లేకుండా చట్టాలను చుట్టాలుగా మార్చుకుని దోచుకు తినడమే బాబుకి తెలుసన్నారు. గాంధీజీ అహింస, నీతికి, ఆదర్శానికి, నిగ్రహానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. గాంధీ జయంతి రోజున నిరుద్యోగ యువత ఇటువంటి కార్యక్రమం చేపట్టారంటే గాంధీపై ఏ మాత్రం గౌరవమున్నా చంద్రబాబు యువతకు ఓ నిజమైన హామీనివ్వాలన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఊరురా, వాడవాడలా తిరిగి అబద్ధపు హామీలు ప్రచారం చేసి, పోస్టర్లు అంటించి వాటన్నింటిని గాలికొదిలేసిన బాబుని ప్రజలు ఏ విధంగా క్షమించరన్నారు. ముఖ్యమంత్రి అంటే పీకపోయినా మాటమార్చకుండా ఉండాలే తప్పా చంద్రబాబులా గంటకోమాట, గడియకోమాట చెప్పి ప్రజలను మోసం చేయడం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment