► మినీ మహానాడులో టీడీపీ నేతల ఆవేదన
► మన బలమేంటో అందరికీ తెలుసన్న బీద
► కొత్త వారు ఇంకా వస్తారనీ వారితో కలిసి పని చేయాల్సిందేనని వెల్లడి
► జిల్లాలో మూడు బలమైన సామాజికవర్గాలు వైఎస్సార్ సీపీతో ఉన్నాయి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పార్టీ అధికారంలో లేని పదేళ్లు జెండాలు మోసిన వారికి ఇప్పుడు గుర్తింపు ఇవ్వాలి. ఎన్నికల ముందు, తర్వాత వచ్చిన వాళ్లు పదవులు తన్నుకుపోతోంటే పార్టీనే నమ్ముకుని ఉన్న వారు పల్లకి మోసే బోయీలుగానే ఉండి పోవాల్సి వస్తోంది. ఇది అన్యాయం. పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులనే నామినేటెడ్ పోస్టుల్లో నియమించాలని టీడీపీ ముఖ్య నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాక్షిగా తమ ఆవేదన, ఆందోళన వెళ్ల గక్కారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో మన బలమెంతో, ఎన్ని స్థానాలు గెలిచామో అందరికీ తెలుసు. వైఎస్సార్ సీపీ నుంచి 8 మంది జెడ్పీటీసీలను తెచ్చినా జెడ్పీ గెలవలేకపోయాం. తలకిందులు పెట్టి కాళ్లు పైకి పెట్టినా నెల్లూరు కార్పొరేషన్ గెలవలేక పోయాం.
జిల్లాలో మూడు ప్రధాన సామాజిక వర్గాలు టీడీపీకి వ్యతిరేంకగా ఉన్నాయి. కాబట్టి ఇతర పార్టీల నుంచి నాయకులను తెస్తాం. పాత వారంతా సర్దుకు పోవాల్సిందేనని జిల్లా పార్టీ అధ్యక్ష్యుడు బీద రవిచంద్ర తెగేసి చెప్పారు. కస్తూరి దేవి గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా మినీ మహానాడులో పదవుల విషయంలో తమ పరిస్థితి దారుణంగా ఉందని ఒక మోస్తరు నేతలు సైతం ఆవేదన వెల్లబోసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా జరిగిన అభివృద్ధి, లోటుపాట్లు చర్చించుకుని, పార్టీ, ప్రభుత్వ పరంగా జిల్లాకు చేయాల్సిన అంశాలపై తీర్మానాలు చేయడం కోసం మినీమహానాడు నిర్వహించారు. ఈ మహానాడులో ప్రతిపాదనలు, వాటిపై చర్చలు, తీర్మానాల విషయాలను వదిలేసి నాయకులు రాజకీయ ప్రసంగాలు చేశారు.
కార్యకర్తల తీవ్ర అసంతృప్తి
పార్టీ కష్ట కాలంలో జెండా మోసిన కార్యకర్తలకు ఇప్పుడు పదవులు దక్కడం లేదని మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాదరావు, నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో పాటు పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి కోసం పాత వారిని బలి చేయొద్దని అంతా కలసి పదవులు పంచుకోవాలని సూచించారు. నెల్లూరు నగరం, రూరల్ నియోజక వర్గాల్లో పార్టీలో ఐదు గ్రూపులు ఉన్నాయనీ, అంతా కలసి పనిచేయకుండా తొలి నుంచి పార్టీ కోసం పల్లకి మోస్తున్న కార్యకర్తలకు అన్యాయం చేయరాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి జిల్లా నాయకులకు సూచించారు. ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన మేయర్ అబ్దుల్ అజీజ్, ఆనం వివేకానందరెడ్డిలను దృష్టిలో పెట్టుకుని నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శలు చేశారు. మొత్తం మీద పదవులు రాని పార్టీ నేతలు తమ గోడు వెల్లబోసుకోవడానికి ఈ వేదికను వాడుకున్నారు.
కలసి పనిచేయాల్సిందే
జిల్లాలో పదిహేనేళ్లుగా పార్టీ పరిస్థితి ఏమిటనేది అందరికీ తెలుసు. 2014 ఎన్నికల్లో జిల్లాలో మూడేసీట్లు గెలిచామని, నిజంగా అంత బలమే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని జిల్లా పార్టీ అధ్యక్షుడు రవిచంద్ర అసంతృప్త నాయకులను నిలదీశారు. కావలిలో కూడా ఎమ్మెల్యే, మున్సిపాలిటీ ఓడిపోయామన్నారు. నెల్లూరు నగరంలో మేయర్ సీటు గెవలలేకపోయినందువల్లే అజీజ్‌ను చేర్చుకోవాల్సి వచ్చిందన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి గెలుచుకోవాలని మంత్రి నారాయణ వైఎస్సార్ సీపీ నుంచి 8 మంది జెడ్పీటీసీలను తెచ్చినా ఉపయోగం లేక పోయిందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే 2019లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయనీ, అందుకే ఎన్నికల ముందు, తర్వాత కూడా ఇతర పార్టీల నుంచి నాయకులను తెచ్చుకుంటూనే ఉన్నామన్నారు.
పదేళ్లు జెండాలు మోసినా పదవులివ్వరా?
Published Tue, May 24 2016 8:32 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement